కల్వకుంట్ల అజెండాగా మారిన గులాబీ జెండా  

గులాబీ జెండా.. కల్వకుంట్ల అజెండాగా మారిందని బీజేపీ ఎంపీ అరవింద్ విమర్శించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులే ఈ మాటలు అంటున్నారని చెప్పారు. నిజామాబాదు జిల్లాలోని పలువురు టీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మంగళవారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. 

ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. కేటీఆర్‌ను సీఎంను చేయాలని శాసనమండలి ఛైర్మన్ అనటం.. సీఎంగా కేసీఆర్ పనికిరారని ఒప్పుకోవటమేనని ఎద్దేవా చేశారు. 2023లో సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు వేగంగా ఆకర్షితులవుతున్నారని, తొమ్మిది నెలల కాలంలోనే బీజేపీని బండి‌ సంజయ్ బలోపేతం చేశారని ప్రశంసల వర్షం కురిపించారు. రానున్న మూడేళ్ళు బండి సంజయ్‌ను ఎలా తట్టుకోవాలో కేసీఆర్‌కు అర్థం కావటం లేదని తెలిపారు.

నూతన వ్యవసాయ చట్టాలతో నిజామాబాద్ రైతులకు మేలు జరుగుతోందని భరోసా వ్యక్తం చేశారు. మోదీ అభివృద్ధి, కేంద్ర సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నిజామాబాద్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరారని చెప్పారు.

ఇలా ఉండగా, సీఎం కేసీఆర్ ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని  బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి డిమాండ్ చేశారు. తెలంగాణను కేసీఆర్  అవినీతిలో  మొదటి స్థానంలో నిలిపారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పర్యటించిన వివేక్ అంబేద్కర్, కాకా వెంకటస్వామి విగ్రహాలకు పూలమాల వేసి నివాళుర్పించారు. తర్వాత  బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వివిధ పార్టీలకు  చెందిన కార్యకర్తలు వివేక్ సమక్షంలో  బీజేపీ చేరారు.  

రాష్ట్రంలో  ఆయుష్మాన్ భారత్ అమలు చేసి  ఉంటే  ఎంతోమంది  పేదలకు ఉపయోగపడేదని వివేక్ చెప్పారు. వేక్. సన్నవడ్లు  వేసుకోమని చెప్పి కొనకుండా రైతులను  సీఎం  మోసం  చేశారని విమర్శించారు.