నాగార్జునకు  దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం 

టాలీవుడ్ సీనియర్ హీరో, `కింగ్` నాగార్జున అరుదైన గౌరవం దక్కించుకున్నారు. భారత సినిమా పితామహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే పేరు మీద నెలకొల్పిన దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి నాగార్జున ఎంపికయ్యారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి `మోస్ట్ వర్సటైల్ యాక్టర్` అవార్డు నాగార్జునకు దక్కింది. ఈ అవార్డుల జాబితాను తాజాగా ప్రకటించారు.

ఈ క్రమంలో టాలీవుడ్‌కు సంబంధించిన ఆరు కెటగిరిల్లో అవార్డులు వరించాయి. యువ నటుడు నవీన్ పోలిశెట్టి సౌత్ కేటగిరీలో ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నందుకు గానూ నవీన్‌కు ఈ అవార్డు వరించింది. ఇక బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన నాని ‘జెర్సీ’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

‘డియర్ కామ్రేడ్’లో అద్భుతమైన నటన ప్రదర్శించిన రష్మిక మందన్న ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది. ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్‌ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’కు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు సుజీత్ ఉత్తమ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు.

అలాగే ‘అల వైకుంఠపురములో’ వంటి మ్యూజికల్ హిట్‌తో సంగీత ప్రియులను ఆకట్టుకున్న ఎస్ఎస్ తమన్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా హిందీకి సంబంధించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2020 ప్రదానోత్సవాన్ని ఫిబ్రవరి 20 ముంబైలోని తాజ్ లాండ్స్ ఎండ్‌లో జరుపుబోతున్నారు. సౌతిండియా అవార్డుల ప్రదానోత్సవం తేదీని అతి త్వరలో తెలుపనున్నారు.