అమరుల త్యాగం ఫలించాలంటే బిజెపి గెలవాలి 

‘‘అమరుల త్యాగం ఫలించాలంటే 2023లో మనం అధికారంలోకి రావాలి. ఇప్పుడు రాకపోతే మళ్లీ ఎప్పుడూ పవర్లోకి రాలేం” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని, గోల్కొండ కోట మీద బీజేపీ జెండా ఎగరాలని చాలా మంది కోరుకుంటున్నారన్నారని తెలిపారు. 

ఈ రాక్షస పాలన అంతం కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. జనాల ఆలోచనలో మార్పు వచ్చిందని, రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చారని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు చెప్పారు. 

ఆదివారం హైదరాబాద్ మెహదీపట్నంలోని ఒయాసిస్ స్కూల్ లో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన శిక్షణ శిబిరంలో మాట్లాడుతూ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని సంజయ్ గుర్తు చేశారు. బీజేపీ మినహా మిగతా ప్రాంతీయ, జాతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలని చెప్పారు. వ్యక్తుల నిర్ణయాలు కాదు సమష్టి నిర్ణయాలతో ఏర్పడ్డదే బీజేపీ అని పేర్కొన్నారు.

ప్రజలకు న్యాయం చేయడం కోసం మనం అధికారంలోకి రావాలని, ‘బీజేపీ ఎక్కడ ఉంది?’ అన్న కేసీఆర్ కు ఎక్కడ ఉందో చూపించామని గుర్తు చేశారు. ‘‘నా చిన్నప్పటి నుంచి 370 ఆర్టికల్ రద్దు చేస్తారని వింటున్నా. కానీ కాంగ్రెస్ వల్ల కాలేదు. బీజేపీ రావడంతోనే దాన్ని తీసివేసింది. 370 ఆర్టికల్ రద్దు కోసం జరిగిన ఉద్యమంలో చాలా మంది విద్యార్థులు, బీజేపీ కార్యకర్తలను దుండగులు చంపారు” అని సంజయ్ చెప్పారు.

అయోధ్య రామ జన్మభూమిలో రామ మందిరం కడుతున్నామని సంజయ్ చెప్పారు. రామ మందిరం కట్టడమే లక్ష్యంగా పనిచేశామని, ఈరోజు కడుతున్నామని తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్ మతాల వాళ్లు కూడా తమ పార్టీలో ఉన్నారని చెప్పారు. తమ పార్టీలోని ముస్లింలు ట్రిపుల్ తలాక్ రద్దుకు సపోర్ట్ చేశారని పేర్కొన్నారు.

దుబాయ్ లో ఒక దుర్మార్గుడు సరస్వతి దేవిని నగ్నంగా బొమ్మ గీశాడని మండి పడ్డారు. బీజేపీ ఎప్పుడూ ఇతర మతాల వారిని కించపరచదని స్పష్టం చేశారు. ‘‘కేసీఆర్ భయంకర హిందువు అని చెప్పుకుంటున్నాడు. ‘15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను లేకుండా చేస్తా’ అని ఒవైసీ అన్నాడు. కానీ కేసీఆర్ ఆయన్ను ఒక మాట కూడా అనలేదు” అని ఎద్దేవా చేశారు.