
భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ప్రస్తుతానికి బ్యాక్‌అప్‌గా అందుబాటులో ఉంచుకునే అవకాశం ఉందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
దీనికి ఆదివారం అనుమతులు లభించడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో డాక్టర్ గులేరియా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతకుముందు, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వీజీ సోమని సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు.
అయితే, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌కు అనుమతులు మంజూరైన తీరు పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనలను పక్కనబెట్టి కోవాగ్జిన్ అత్యవసర, పరిమిత వినియోగానికి అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో డాక్టర్ గులేరియా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రధాన వ్యాక్సిన్ అవుతుందని తన అభిప్రాయమని తెలిపారు. రీఇన్‌ఫెక్షన్ సోకినపుడు ఎమర్జెన్సీ వినియోగం కోసం మాత్రమే బ్యాక్‌అప్‌గా భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుతారని తాను అనుకుంటున్నట్లు తెలిపారు.
కొద్ది వారాలపాటు సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తారని, 50 మిలియన్ల డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత భారత్ బయోటెక్ ఫేజ్-3 ట్రయల్స్ డేటా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. తమ వ్యాక్సిన్ సత్ఫలితాలిస్తోందని, సురక్షితమైనదని ఆ సంస్థ నిరూపించుకునే అవకాశం ఉంటుందని, అప్పుడు ఆ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారంతో జరుగుతున్నాయి. ఫేజ్-1, ఫేజ్-2 ట్రయల్స్ పూర్తయ్యాయి. ఫేజ్-3 ట్రయల్స్ కోసం 22,500 మందికి వ్యాక్సినేషన్ చేశారు. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని డ్రగ్ కంట్రోలర్ జనరల్ వీజీ సోమని ఆదివారం స్పష్టం చేశారు.
More Stories
సిక్కింని ముంచెత్తిన వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
గంట వ్యవధిలో నేపాల్ నుండి నాలుగు భూకంపాలు
41 మంది కెనడా దౌత్యవేత్తలకు దేశం వదిలి వెళ్ళమని ఆదేశం