ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌కు ఆమోద ముద్ర 

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌కు ‘కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ’ (సీడీసీఎస్‌వో) నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేసింది. టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలుపాలంటూ ‘భారత ఔషధ నియంత్రణ సంస్థ ’(డీసీజీఐ)కు శుక్రవారం సిఫారసు చేసింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) భారత్‌లో ఈ టీకాను ఉత్పత్తి చేస్తున్నది.
టీకాకు ఆమోదం లభిస్తే, దేశంలో అనుమతి పొందిన తొలి కరోనా టీకాగా కొవిషీల్డ్‌ నిలువనున్నది. ఇదివరకే బ్రిటన్‌, అర్జెంటినా ఈ టీకాకు ఆమోదం తెలిపాయి. టీకా అత్యవసర వినియోగానికి ఇప్పటివరకు మూడు సంస్థలు డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. సీరం సంస్థతో పాటు భారత్‌ బయోటెక్‌, ఫైజర్‌ ఈ జాబితాలో ఉన్నాయి.
నిపుణుల కమిటీ ముందు గత బుధవారం సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు ప్రజెంటేషన్‌ ఇచ్చాయి. ఫైజర్‌ సంస్థ కొంత సమయం కావాలని కోరింది. అ త్యవసర అనుమతులపై శుక్రవారం మరోసారి సమావేశమైన నిపుణుల కమిటీ కొవిషీల్డ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. భార త్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్‌పైనా కమిటీ సమీక్షించింది.
ఇప్పటివరకు కొవాగ్జిన్‌ సురక్షితమని తేలినా, సామర్థ్యంపై ఇంకా అంచనాకు రావాల్సి ఉన్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో అనుమతుల పరిశీలనకు టీకా సామర్థ్యంపై మధ్యంతర విశ్లేషణలు జరుపవచ్చని, టీకా వలంటీర్ల నియామకాలను వేగవంతం చేయాలని భారత్‌ బయోటెక్‌కు సూచించింది. దేశంలో టీకా రేసులో కొవిషీల్డ్‌ ముందు వరుసలో ఉన్నది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ మాదిరి ఈ టీకాను నిల్వ చేయడానికి అతిశీతల ఉష్ణోగ్రతలు అవసరం లేదు. రిఫ్రిజరేటర్‌ ఉష్ణోగ్రతల్లో (2-8 డిగ్రీలు) నిల్వచేయవచ్చు. టీకా ధర కూడా తక్కువ. రెండు డోసుల ధర రూ.1000 లోపే ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
డీసీజీఐ నుంచి తుది అనుమతులు లభిస్తే ఈ నెలలోనే వ్యాక్సినేషన్‌ ప్రారంభించేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్నది. ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేస్తున్న టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గురువారం ఆమోదం తెలిపింది. ఫలితంగా వైద్య ఆరోగ్య వ్యవస్థలు సరిగా లేని పేద దేశాల్లో టీకా వినియోగానికి మార్గం సుగమమైంది.
సాధారణంగా ప్రతి దేశంలోని నియంత్రణ సంస్థలు కొవిడ్‌ టీకాకు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. అయితే బలహీన వైద్య వ్యవస్థలు కలిగిన పేద దేశాలు డబ్ల్యూహెచ్‌వో అనుమతిపై ఆధారపడుతుంటాయి. తాజా అనుమతి నేపథ్యంలో ఆయా దేశాలు టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసుకునేందుకు వీలు కలుగుతుంది.
కాగా, ఎలాంటి పరిమితులు లేకుండా కరోనా టీకాల ఎగుమతి, దిగుమతికి కేంద్రం అనుమతినిచ్చింది. ఈ మేరకు ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌’ (సీబీఐసీ) నిబంధనలను సవరించింది. వ్యాక్సిన్లకు త్వరితగతిన క్లియరెన్స్‌ ఇచ్చేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలని ఫీల్డ్‌ ఆఫీసర్లకు లేఖ రాసింది.
వివిధ ఆరోగ్య సమస్యలకు వైద్యంగా గిరిజనులు ఉపయోగించే ఎర్ర చీమలతో చేసిన చట్నీ కరోనా చికిత్సకు ఎంతవరకు ఉపకరిస్తుందో పరిశీలించాలని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ డైరెక్టర్లను, సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్తలను ఒడిశా హైకోర్టు ఆదేశించింది.
దేశంలోని ప్రజలందరికీ కరోనా టీకాను ప్రభుత్వం ఉచితంగా వేయబోదని కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌ తెలిపారు. మొదటి దశలో టీకా వేసే 30 కోట్ల మందికి మాత్రమే ఉచితంగా వేస్తామని చెప్పారు. మరో ఆరు నుంచి 8 నెలల్లో 30 కోట్ల మందికి టీకాలు వేస్తారని వెల్లడించారు. మొదటి దశలో టీకాలు వేసే వారిలో ప్రధానంగా వైద్య, ఆరోగ్యరంగంలో పనిచేస్తున్నవారు, వృద్ధులు, భద్రతాదళాలు, పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన వినోద్‌.. దేశవ్యాప్తంగా 29 వేల క్షేత్రస్థాయి టీకా నిల్వ కేంద్రాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు 31 హబ్‌లను నెలకొల్పినట్టు చెప్పారు.
 దేశవ్యాప్తంగా శనివారం నిర్వహించబోయే కరోనా వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌కు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం దీనిపై సమీక్ష నిర్వహించారు. డిసెంబర్‌ 28న పంజాబ్‌, గుజరాత్‌, అసోం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో డ్రైరన్‌ను ప్రయోగాత్మకంగా జరిపారు.
ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈ సారి అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్‌ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలను ఎంపిక చేశారు.  హైదరాబాద్‌లో నాలుగు కేంద్రాల్లో, మహబూబ్‌ నగర్‌లో మూడు కేంద్రాల్లో డ్రై రన్‌ నిర్వహించనున్నారు.