ఆయుష్మాన్‌తో ఆరోగ్యశ్రీ అనుసంధానం

వ్యవసాయ చట్టాల వ్యతిరేకత విషయంలో తమ ధోరణి మార్చుకొని సానుకూల వైఖరి ప్రదర్శించిన తెలంగాణ  ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మరో కీలక అంశంలో సహితం కేంద్రంతో సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయుష్మాన్ భారత్‌లో ఆరోగ్య శ్రీ పథకాన్ని అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశారు. అన్ని రాష్ట్రాల సిఎస్‌లతో ప్రధాని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయుష్మాన్ భారత్ , ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన , జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించారు.
ఈ సమీక్షకు బిఆర్‌కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సిఎస్ సోమేష్ కుమార్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై వివరించారు. తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా అన్ని గృహాలకు పంపుల తో సురక్షితమైన నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 98.5 శాతం గృహాలు సురక్షితమైన తాగునీటితో కవర్ అయ్యాయని సిఎస్ భారత ప్రభుత్వానికి వెల్లడించారు. ఈ సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వీ తదితర అధికారులు పాల్గొన్నారు.
బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం కావడంతో కేసీఆర్ ఇంతకాలం వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ పరాజయాల అనంతరం తన నిర్ణయాలను అనూహ్యంగా మార్చుకుంటున్నారు. కేసీఆర్ మొన్ననే నియంత్రిత సాగు విధానానికి వీడ్కోలు పలికారు. ఎల్ ఆర్ ఎస్‌ను ఎత్తివేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని కూడా నిర్ణయించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించుకోవడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హర్షం ప్రకటించారు. అయితే గత రెండేళ్లుగా తెలంగాణ  రాష్ట్రంలో ఆయుష్మాన్  భారత్ ను  అమలు చేయని  కారణంగా రోగాల బారిన పడ్డ పేదలు ఆర్థికంగా నష్టపోయిన్రు, ప్రాణాలను కోల్పోయిన్రు. అవస్థలు పడ్డరు. అప్పులపాలూ అయిన్రు. అందుకు కేసీర్ పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈ పధకాన్ని సమర్ధవంతంగా అమలు జరపాలని కోరారు.