ఎల్ఆర్ఎస్ పై వెనుకడుగు వేసిన కేసీఆర్ 

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్‌పై (వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు) సర్వత్రా వ్యతిరేకత, నిరసనలు  ఎదురవుతూ ఉండడంతో వెనుకడుగు వేసింది. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఎదురైనా ప్రతికూల ఫలితాలతో ఖంగు తిని, నష్ట నివారణ చర్యకు పాల్పడిన్నట్లున్నది. 
 
 ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్య‌వ‌సాయేత‌ర భూముల‌ రిజిస్ట్రేష‌న్ల‌కు అనుమ‌తి తెలిపింది. కాగా కొత్త‌గా వేసిన లే అవుట్‌ల‌కు మాత్రం ఎల్ఆర్ఎస్ త‌ప్ప‌నిసరి అని పేర్కొంది. ఎల్ఆర్ఎస్‌తో సంబంధం లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని,  ఇప్పటి వరకూ ఉన్న ఆ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
 
గతంలో ఎల్ఆర్ఎస్ అనుమతి పొందినవాటికి రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.  కొత్త ప్లాట్లకు మాత్రం సంబంధిత సంస్థల అప్రూవల్ పొందిన తర్వాతే రిజిస్ట్రేషన్ ఉంటుందని కేసీఆర్ సర్కార్ తెలిపింది.  ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంతో ఇప్ప‌టికే రిజిస్ట్రేష‌న్ అయిన ప్లాట్లు, నిర్మాణాల‌కు అడ్డంకులు తొలిగాయి.  రిజిస్ట్రేషన్‌ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్‌ కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 25.59 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఆయా ప్లాట్ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. వివాహాలు, ఉన్నత విద్య కోసం అవసరమైన నగదును సమకూర్చుకోవాలంటే ప్లాట్లను అమ్ముకోక తప్పదని  ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనతో అమ్ముకోలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసిన రశీదు ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేసుకునే వీలు కల్పించి, క్రయవిక్రయాలు జరిగేలా చూడాలని సర్కారు ఈ  నిర్ణయం తీసుకుంది.