ఎమ్యెల్సీ ఎన్నికల కోసమే కేసీఆర్ ఉద్యోగులకు వరాలు 

ఎమ్యెల్సీ ఎన్నికల కోసమే కేసీఆర్ ఉద్యోగులకు వరాలు 
కేసీఆర్ మరోసారి ఉద్యోగస్తులను ప్రకటనలతో మోసం చేయాలని చూస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.  వేతన సవరణ సంఘం పదవీకాలం రెండేళ్లు  పూర్తి చేసుకున్నా,  డిసెంబరు 31న  పదవీ  కాలం  ముగుస్తుందని తెలిసీ కూడా వేతన సవరణ సంఘం రిపోర్టు ఇవ్వకపోవడం తెలంగాణ ఉద్యోగులను మోసం చేయడమే అని స్పష్టం చేశారు. 
 
 రెండు సంవత్సరాల పాటు పీఆర్సీ కమిషన్ (వేతన సవరణ సంఘం)  చేయని  పనిని  ఇప్పుడు ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో కొత్త కమిటీ చేస్తదట అని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో చేయని పనిని చీఫ్  సెక్రటరీ రెండు నెలల్లో ఎలా పూర్తి చేస్తాడు? అని ప్రశ్నించారు. 
 
మనతో విడిపోయిన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 శాతం మధ్యంతర భృతి ఇస్తుంటే, ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ కనీసం  జీతాలు కూడా  ఇవ్వలేకపోతున్నాడని ధ్వజమెత్తారు. ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు  రాబోతున్నాయి కాబట్టి ఉద్యోగస్తులను  మచ్చిక చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడనీ  దుయ్యబట్టారు . 
 
ఈయన బహురూపుల వేషాలను ఇక ఎవరూ నమ్మరని సంజయ్ స్పష్టం చేశారు. పగలి వేషాలు వేసేవాళ్లు  కూడా  కేసీఆర్ ను చూసి నవ్వుకుంటున్నారని చెప్పారు. గత ఆరేళ్ల నుంచి ఉద్యోగులను,  నిరుద్యోగులను మోసం చేసిండు. ఈరోజు కేసీఆర్ చేసిన ప్రకటనలో కొత్తదేమీ లేదని విమర్శించారు. 
 
ఫిబ్రవరి లో ఎమ్మెల్సీ ఎన్నికలు  రానున్నాయి  కాబట్టి,  ఎలాగూ ఎన్నికల కోడ్ వస్తది  కాబట్టి. ఆ పేరుతో  తప్పించుకోవడం  కోసం  మరో నాటకమేస్తున్నాడని సంజయ్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఉద్యోగులకు, నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే  నిన్ను బజార్  లో  నిలబెడుతం. నీ  వేషాలను  బట్టబయలు చేస్తాం అంటూ హెచ్చరించారు. 
 
కొందరిని  కొంతకాలం మోసం చేయోచ్చేమో కానీ, అందరినీ అన్నిసార్లు  మోసం చేయలేవని సంజయ్ స్పష్టం చేశారు. ఉద్యోగస్తులకు పీఆర్సీ  ఇచ్చేంతవరకు నిన్ను దోషిగా నిలబెడుతం. ఫిబ్రవరి  గడువు  పేరుచెప్పి  తప్పించుకుంటే.. టీఆర్ఎస్  ను బొందపెట్టే వరకు నిద్రపోం అంటూ సంజయ్ హెచ్చరించారు.