కోదండ రాముడి తల తొలగించిన దుండగులు 

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం కొండపై 400 ఏళ్ల చరిత్ర గల  ప్రసిద్ధి గాంచిన దేవాలయంలో మంగళవారం తెల్లవారుజామున కొందరు దుండగులు  ఆలయంలోకి ప్రవేశించి విగ్రహాలను ధ్వంసం చేశారు.  ఈ దాడిలో  శ్రీ రాముల వారి శిరస్సును ఖండించారు.  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో వరుసగా దేవాలయాలపై, దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులు ఆగ్రవేశాలు కలిగిస్తున్నాయి. 
రామతీర్థంలోని శ్రీరామస్వామి దేవస్థానం పక్కనే సుమారు 800 అడుగుల ఎత్తులో ఉన్న బోడికొండపై కోదండ రామాలయం ఉంది. మంగళవారం ఉదయం అర్చకుడు వెళ్లేసరికి ఆలయ తలుపులకు తాళం లేకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు. వారు నెల్లిమర్ల పోలీసులకు తెలిపారు. అందరూ కలసి ఆలయం లోపల పరిశీలించగా శ్రీరామచంద్రస్వామి విగ్రహం తల తెగి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే తల భాగం కోసం పరిసరాల్లో వెతికినా ఎక్కడా దొరకలేదు. పోలీస్‌ జాగిలాలు, క్లూస్‌ టీమ్‌ ప్రతినిధులు ఆధారాల సేకరణ ప్రారంభించారు.
 
రాముడి విగ్రహం తల నరికి తీసుకువెళ్లిన ఘటన చాలా దారుణం. మీ ప్రభుత్వంలో ఈ ఘటనకు ముఖ్యమంత్రిగా మీకు సిగ్గు అనిపించడం లేదా?  అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. జీసస్ విగ్రహం తల నరికి ఎవరైనా తీసుకువెళితే క్షణాల్లో పట్టుకుంటారు. హిందూ దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేసినా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని నేరస్తులను పట్టుకోవడం లేదని దుయ్యబట్టారు. 
 
సీఎం గారు మీకు హిందువులంటే అంత చులకనా? అంటూ నిలదీశారు. హిందూ ఆలయాలపై దాడులు చేసేవారిని తక్షణం పట్టుకునే విధంగా పోలీసు శాఖకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో వరుస సంఘటనలు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని హెచ్చరించారు. ఇప్పటికైనా స్పందించి దయచేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

కోదండరాముని విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసగా తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టనుంది. పార్టీ కార్యాలయం నుంచి ఆలయం వరకు మౌన ప్రదర్శన నిర్వహిస్తామని విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అదితి గజపతిరాజు తెలిపారు. మరోవంక, ఈ విగ్రహం తల  తొలగించిన దుండగుల దురాగతాల్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీమతి రెడ్డి పావని మంగళవారం మధ్యాహ్నం అనేక మంది కార్యకర్తలతో బయలుదేరి జరిగిన ఘటనను సందర్శించారు. 

ఈ సంఘటనకు పాల్పడిన దుండగులను తక్షణమే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం చేతకానితనం వల్లనే ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయని ధ్వజమెత్తా రు. ఇలాంటి సంఘటనల ద్వారా హిందూ సమాజానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని  ఆమె డిమాండ్ చేశాన్నారు.
 
దోషులను పట్టుకున్న తర్వాత నే ఈ విజయనగరంలో ముఖ్యమంత్రి అడుగుపెట్టాలని ఆమె స్పష్టం చేశారు. దేశమంతా అయోధ్యలో రామమందిర నిర్మాణం లొ భాగస్వామ్యం అవుతున్న తరుణంలో ఇక్కడ రాముని విగ్రహం తల తొలగించటం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు ఆలయం లోపలకు అనుమతించక పోవడంతో వణికించే చలిలోనే పార్టీ నేతలతో కలిసి ఆమె నిరసన తెలియజేస్తున్నారు.
 
హిందూ సమాజం తిరగ బడకముందే ఈ ప్రభుత్వం మేల్కొనాలని కోరుతూ ఈ విషయంలోరాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు తక్షణమే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలాంటి సుప్రసిద్ధ, పురాతన దేవాలయాలకు రక్షణ కల్పించక పోవడం, కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని మండిపడ్డారు. 
 
హిందూ సమాజం పై, హిందూ దేవాలయాల పై వరుస దాడులు దేనికి నిదర్శనం అని బిజెపి రాష్ట్ర  కార్యవర్గ సభ్యులు నడికుడి ఈశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. 
రామస్వామివారి విగ్రహాన్నిధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  సోమువీర్రాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా కొండపై ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తల పట్ల ప్రభుత్వం యాంత్రంగా దురుసుగా ప్రవర్తించిందని ఆయన మండిపడ్డారు.  
 
 ధర్మ పరిరక్షణలో భాగంగా చారిత్రక దేవాలయాల రక్షణ ప్రతి పౌరుని బాధ్యత అనే అంశాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం గుర్తుంచాలి. కొండపై చలిలో బిజెపి కార్యకర్తలు చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వ అధికారులు నీరుగార్చే ప్రయత్నం చేయడం.. వారు చలిలో వున్న పరిస్థుతులలో, వారికి దుప్పట్లు కూడా కొండపైకి తీసుకెళ్లకుండా నిరోధిస్తున్న ప్రభుత్వ యంత్రాగం వైఖరిని తీవ్రంగా ఖండించారు.