వ్యాక్సిన్ స్ట్రెయిన్‌పై కూడా పనిచేస్తుంది 

వ్యాక్సిన్ స్ట్రెయిన్‌పై కూడా పనిచేస్తుంది 
కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు కొత్త స్ట్రెయిన్ వైరస్‌పై పనిచేయవని ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ స్ట్రెయిన్‌పై కూడా పనిచేస్తుందని భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె.విజయ్ రాఘవన్ తెలిపారు.
అయితే తొలుత ఎదుర్కొన్న కరోనా వైరస్‌తో పోల్చితే కరోనా స్ట్రెయిన్ ఇతరులకు వేగంగా సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. కరోనా మార్పు చెంది స్ట్రెయిన్‌గా మారిన్పటికీ, ఆ వైరస్ కేవలం మనిషి రోగనిరోధక శక్తిని మాత్రమే తగ్గించగలదని, వ్యాక్సిన్ పనిచేయకుండా చేయగలిగే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. అయితే వైరస్ మార్పు చెందుతున్న ఈ తరుణంలో మరింత అప్రమత్తత అవసరమని హెచ్చరించారు. యూకేలో వెలుగుచూసిన కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ అక్కడి నుంచి భారత్‌కు వచ్చిన వారిలో ఆరుగురికి సోకింది. వారికి ప్రస్తుతం చికిత్సనందిస్తున్నారు.
డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకూ యూకే నుంచి భారత్‌కు రాకపోకలను కేంద్రం ఇప్పటికే నిలిపివేసిన సంగతి తెలిసిందే. కొత్త రకం కరోనా వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిసిఎంబి పేర్కొంది. అయితే జాగ్రత్తలు పాటించడం అవసరమని ఆ సంస్థ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా కూడా స్పష్టం చేశారు. 
 
ఇది చూడడానికి కొత్తగా కనిపించినప్పటికీ, ఇదీ కరోనా వైరస్‌ కావడంతో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. లక్షణాలు, తీవ్రత ఒకే రకంగా ఉంటాయని, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని భరోసా ఇచ్చారు. 
 
అయితే కొత్త రకం వైరస్‌ వ్యాప్తి వేగంగా, అధికంగా జరుగుతుందని హెచ్చరించారు. భారత్‌లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించడం అవసరమని చెప్పారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌ ధరించాలని, చేతులను సబ్బుతో వీలైనన్ని ఎక్కువసార్లు కడుక్కొవాలని సూచించారు.
ఇలా ఉండగా, భారత్ యూకే నుంచి వచ్చిన వారిలో ఇప్పటి వరకు ఆరుగురికి సోకినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వీరిలో బెంగళూరు నుంచి ముగ్గురు, పూణేలో మరోకరుతో పాటు తెలంగాణ, ఏపి రాష్ట్రాల నుంచి ఒక్కోక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఇతర దేశాల్లో ఈ స్ట్రెయిన్‌ను పరిశీలిస్తే వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ, మరణాలు లేకపోవడం కాస్త ఊరటని కలిగించే అంశమని అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు.