కొవిడ్ మరణాల్లో 70 శాతం పురుషుల్లోనే!  

దేశంలోని మొత్తం కొవిడ్ మరణాల్లో 70 శాతం పురుషుల్లో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 60 ఏళ్ల లోపు వారిలో 45 శాతం మరణాలు నమోదైనట్టు పేర్కొంది. అలాగే, ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 63 శాతం పురుషుల్లో, 37 శాతం స్త్రీలలో నమోదైనట్టు వివరించింది.

ఆరు నెలల తర్వాత దేశంలో తొలిసారి రోజువారీ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 17 వేలకు తక్కువగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 2.7 లక్షల దిగువన ఉన్నట్టు చెప్పారు. గత వారం రోజులుగా దేశంలో పాజిటివిటీ రేటు 2.25 శాతం ఉండగా, మొత్తంగా 6.02 శాతం ఉన్నట్టు వివరించారు.

ఆరు నెలల తర్వాత రోజువారీ కొవిడ్ మరణాల సంఖ్య 300 కంటే తక్కువ నమోదైనట్టు భూషణ్ తెలిపారు. 55 శాతం మరణాలు 60 ఏళ్లు, ఆ పైబడిన వారిలో సంభవించగా, 70 శాతం మరణాలు పురుషుల్లో సంభవించినట్టు పేర్కొన్నారు.

17 ఏళ్ల లోపు వారిలో 8 శాతం, 18-25 ఏళ్ల మధ్య వారిలో 13 శాతం, 26-44 వయసు మధ్య వారిలో 39 శాతం, 45-60 వయసు వారిలో 26 శాతం, 60 ఏళ్లు పైబడిన వారిలో 14 శాతం కరోనా కేసులు నమోదైనట్టు భూషణ్ వివరించారు.