సోమ, మంగళవారాల్లో కేంద్రం చేపట్టిన డ్రై రన్ సజావుగా ముగిసింది. అస్సాం, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్‌ల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏవో చిన్న చిన్న ఇబ్బందులు మినహా మొత్తమ్మీద అంతా బాగానే ముగిసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వచ్చే ఏడాది ప్రారంభంలో కరోనా వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ క్రమాన్ని ముందస్తుగా పరీక్షించడానికి చేపట్టిన ఈ మాక్ డ్రిల్‌లో నిర్వహణా మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకున్నారు.
ఇందులో కేంద్రాలను ఏర్పాటు చేయడం, ప్రదేశాలను గుర్తించడం, ఐటి ప్లాట్‌ఫారమ్ కో-విన్ యాప్‌ను ఉపయోగించడం, ఆరోగ్య సిబ్బంది డేటాను అప్‌లోడ్ చేయడం, వ్యాక్సిన్ల డోసులు అందుకోవడం, కేటాయించడం, సెషన్ ప్లానింగ్, వ్యాక్సినేషన్ బృందాలను మోహరించడం, వ్యాక్సిన్ వేసే ప్రదేశాల్లో అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలన్నీ వుంటాయి.
వ్యాక్సిన్లు వేయడానికి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. వాస్తవంగా వ్యాక్సిన్ వేసే క్రమాన్ని చేపట్టడానికి ముందుగా జరగాల్సిన క్షేత్ర స్థాయి పనులను నిర్వహించడమే ఈ డ్రై రన్ లక్ష్యమని, జిల్లా కలెక్టర్లు ఇందుకు బాధ్యులని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో కృష్జా జిల్లాలో, రాజ్‌కోట్, గాంధీనగర్ (గుజరాత్), లూథియానా, షహీద్ భగత్‌సింగ్ నగర్ (పంజాబ్), సోనిత్‌పూర్, నల్బరి (అస్సాం)ల్లో ఈ డ్రై రన్ చేపట్టారు. మొదటి రోజు వచ్చిన సమాచారాన్ని రెండో రోజూ సమీక్షించారని, అన్ని రాష్ట్రాలు సంతృప్తిని వ్యక్తం చేశాయని ఆ ప్రకటన తెలిపింది.
More Stories
ఖైదీలలో కులవివక్ష పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం
జార్ఖండ్‌లో రైల్వేట్రాక్ పేల్చివేత
వర్షాలు, వరదల వల్ల 1,492 మంది మృతి