భారత్‌లో యూకే కరోనా వైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. మంగళవారం 6 స్ట్రెయిన్ కేసులు నమోదు కాగా, కొత్తగా మరో 14 మందికి స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. దీంతో భారత్‌కు యూకే నుంచి వచ్చిన వారిలో మొత్తం ఇప్పటివరకూ 20 మందికి కొత్త స్ట్రైయిన్ నిర్ధారణ అయింది.
దేశ రాజధాని ఢిల్లీలో స్ట్రెయిన్ కేసులు పెరగడం గమనార్హం. ఢిల్లీ ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్‌లో మొత్తం 8 మందికి కరోనా స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. తర్వాత బెంగళూరు ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్‌ను పరీక్షించగా మరో ఏడుగురికి స్ట్రెయిన్ సోకినట్లు వైద్య శాఖ అధికారులు గుర్తించారు. దేశంలోని ఇతర నగరాల్లో మరో 5 కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి.
స్ట్రెయిన్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. యూకేలో స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్న సమయంలో అక్కడి నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణికులను గుర్తించి, వారికి కరోనా పరీక్షలు చేసే ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసింది.
ఇప్పటికే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకూ యూకే నుంచి 33,000 ప్రయాణికులు భారత్‌కు వచ్చినట్లు కేంద్రం గుర్తించింది. డిసెంబర్ 9 నుంచి 22 వరకూ వచ్చిన ప్రయాణికుల్లో లక్షణాలున్న ప్రయాణికులకు, పాజిటివ్ వచ్చిన ప్రయాణికులకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.
కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటి కంటే ఇవాళ 25 శాతం పెరిగినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. కొత్తగా 20,550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 286 మంది చనిపోయారు. 26,572 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 1.02 కోట్లకు చేరుకోగా, కరోనాతో 1.48 లక్షల మంది మృతి చెందారు.
More Stories
నీట్ పేపర్ లీకేజ్‌లో 144 మందికి ప్రశ్నాపత్రం
మణిపూర్‌లో భారీగా ఆయుధాలు లభ్యం
రైలును పట్టాలు తప్పించేందుకు మరోసారి కుట్ర