కొత్త సంవత్సర సంబరాలపై ఆంక్షలు …. కేంద్రం ఆదేశం 

కొత్త సంవత్సర సంబరాలపై ఆంక్షలు …. కేంద్రం ఆదేశం 

కరోనా వైరస్‌ వ్యాప్తితో పాటు బ్రిటన్‌ పుట్టిన కొత్త వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉన్నందున నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చేసుకునే వేడుకలపై నిషేదాజ్ఞలు విధించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. డిసెంబర్‌ 30, 31, జనవరి 1 స్థానిక పరిస్థితులను అంచనా వేసి..ఈ ఆంక్షలు విధించాలని కోరింది. 

తుది నిర్ణయం మాత్రం రాష్ట్రాలకే వదిలిపెట్టింది. గత మూడు నెలల నుండి దేశంలో యాక్టివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, అదే సమయంలో యూరప్‌తో పాటు అమెరికాలో కేసులు పెరుగుతున్న ఆందోళన నెలకొన్నదని తెలిపింది. ఇటువంటి పరిస్థితుల మధ్య  సమగ్రమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, కఠినమైన భద్రతా ప్రమాణాలు కొనసాగించాల్సిందేనని రాష్ట్రాలకు ఉన్నతాధికారి లేఖలో పేర్కొన్నారు. 

 ‘‘కొన్ని రోజులుగా క్రియాశీల కోవిడ్ కేసులు దేశంలో తగ్గుతున్నాయి. అయితే తాజాగా యూరప్, అమెరికా ప్రాంతాల్లో పెరుగుతున్న న్యూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశంలో కొన్ని అత్యవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అత్యావశ్యకం. దేశంలో కఠినమైన నిఘా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’ అని కేంద్రం ఆ లేఖలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

చలికాలంతో పాటు ఈ సమయంలో వచ్చే న్యూయర్‌, పలు పండుగలను పురస్కరించుకుని సూపర్‌స్ప్రెడర్లుగా మారే ఈవెంట్స్ లకోసం ప్రజలు ఎక్కువగా గుమిగూడకుండా, ఒకేచోట చేరకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని కేంద్రం పేర్కొంది. ఇలా గుమిగూడటం ద్వారా కరోనా మహమ్మారి మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. అదేవిధంగా అంతర్‌ రాష్ట్ర, ఇతర రాష్ట్ర ప్రయాణ, వస్తు రవాణాపై ఎటువంటి ఆంక్షలు లేవని చెప్పారు. పండుగ సమయాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది.