భారత్‌లో అడుగుపెట్టిన కరోనా కొత్త స్ట్రెయిన్

భారత్‌లోకి కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రవేశించింది. ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చిన ఆరుగురిలో తొలిసారిగా ఈ స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన 176 మంది భారత్‌కు వచ్చారు. వీరందరికీ కరోనా పరీక్షలు చేయగా వారిలో ఆరుగురికి కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. వీరిలో బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(ఎన్ఐఎంహెచ్‌ఏఎన్ఎస్)లో ముగ్గురిని గుర్తించారు. 
 
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో ఇద్దరిని, అలాగే పూనేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎఐవీ)లో ఒకరిని గుర్తించినట్లు తెలుస్తోంది. వేరు వేరు రాష్ట్రాల్లో గుర్తించిన వీరిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ఆరోగ్య శాఖలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఒక్కొక్కరినీ ఒక్కో గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా వీరికి ఇప్పటివరకు సన్నిహితంగా ఉన్న వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించినట్లు సమాచారం.  
 
కాగా, దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 16,432 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,02,24,303కు పెరిగింది. మరో 252 మంది మహమ్మారికి బలవగా  మృతుల సంఖ్య 1,48,153కు చేరింది. 
 
గడిచిన ఆరు నెలల్లో అత్యల్ప సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవడం ఇదే తొలిసారి అని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. వరుసగా ఎనిమిదో రోజు యాక్టివ్‌ కేసులు మూడు లక్షల కన్నా తక్కువగా ఉన్నాయని, కాసేలోడ్‌లో 2.63 శాతం ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో రికవరీ రేటు 95.92శాతాని చేరుకుందని, కొవిడ్‌ మరణాల రేటు 1.45శాతంగా ఉందని వివరించింది.