అసెంబ్లీని ముట్టడిస్తాం.. పవన్ హెచ్చరిక

రైతులకు రూ 35,000 పరిహారం ఇవ్వకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలు అడ్డుకుంటామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హెచ్చరించారు. అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు. గుడివాడలో  సోమవారం మాట్లాడిన ఆయన రైతుల సంక్షేమం కోరుకునే ఏకైక పార్టీ జనసేన అని స్పష్టం చేశారు. 
 
భూమి హక్కు లేక కౌలు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కౌలు రైతులు బాధలు పడుతుంటే వాలంటీర్లు ఏం చేస్తున్నారు? ఒక ఏడాది మద్యం ఆదాయాన్ని వదులుకుంటే రైతులకు పరిహారం ఇవ్వొచ్చు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగినా వస్తాం. మీరు సై అంటే మేమూ సై” అంటూ సవాల్ చేశారు. 
 
 అమరావతిలో పెట్టుకుంటారా, వైజాగ్‌లో పెట్టుకుంటారా, పులివెందులలో పెట్టుకుంటారా? అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ పెట్టినా అక్కడికి వస్తాం. అసెంబ్లీని ముట్టడిస్తాం అని స్పష్టం చేశారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడో లేడో తెలియని జనసేనను చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. 
 
మాట్లాడితే సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నా అంటున్నారు. జగన్‌కు ఏ వ్యాపారాలు లేవా? కేవలం రాజకీయాలు చేస్తున్నారా? సీఎం సాబ్‌కు చెబుతా ఉన్నాం. పదివేల రూపాయలు విడుదల చేయండి. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు రూ 35,000 విడుదల చేయకపోతే  రైతులు, నిరుద్యోగులు అందరూ కదలిరండి అంటూ పిలుపిచ్చారు. 
 
“మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. అయ్యా, బాబు, సీఎం గారు అంటే వినడం లేదు. రైతు కోసం జనసేన పార్టీ ఉంది’’ అని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరిక చేశారు.  పవన్ కల్యాణ్  గుడివాడ రాగానే మంత్రి కొడాలి నానిపై పంచ్‌లు వేశారు. పేకాట క్లబ్‌లపై ఉన్న శ్రద్ధ రోడ్లు బాగుచేయడంలో లేదని విమర్శించారు. 
 
గుడివాడలో రోడ్లు అధ్వన్నంగా ఉన్నాయని ప్రజలు రహదారులను బాగుచేయాలని ఎమ్మెల్యేను నిలదీయాలని పిలుపిచ్చారు. ఆయనకు పేకాట క్లబ్‌లు నిర్వహించడంలో ఉన్న సమర్థత  ప్రజాపాలన ముందుకు తీసుకువెళ్లడంలో లేదని ధ్వజమెత్తారు. ఒక వర్గానికి చెందిన మీడియా సంస్థల్లో ఇష్టమొచ్చినట్లు దురుసుగా మాట్లాడితే కుదరదని పవన్ హెచ్చరించారు.
నోటి దురుసు చూపించే ఎమ్మెల్యేలను జనసేన బలంగా ఎదుర్కొంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను భయపెట్టి పాలిద్దామంటే భరించడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరని హెచ్చరించారు. రోడ్లు అస్తవ్యస్థంగా ఉన్నాయని చెబుతూ మార్పు రావాలని, అందరికీ న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తన అంతిమ శ్వాస ఉన్నంతవరకు ప్రజలకు అండగా ఉంటానని పవన్ స్పష్టం చేశారు.