ద‌శాబ్ద‌పు అత్యుత్త‌మ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి

ఐసీసీ అవార్డుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ద‌శాబ్ద‌పు టెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.  సోమ‌వారం ప్ర‌క‌టించిన అవార్డుల్లో ద‌శాబ్ద‌పు అత్యుత్త‌మ క్రికెట‌ర్‌గా నిలిచి స‌ర్ గ్యారీఫీల్డ్ సోబ‌ర్స్ అవార్డ్ అందుకోనున్నాడు. అంతేకాదు ఐసీసీ వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు కూడా కోహ్లినే వ‌రించింది. , 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ సత్తా చాటడంతో ఈ దశాబ్దపు బెస్ట్ వన్డే ప్లేయర్ గా నిలిచాడు.

టెస్ట్ క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు మాత్రం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ద‌క్కింది. ఇక ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ ఆఫ్ ద డెకేడ్ అవార్డును మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ గెలుచుకున్నాడు. 2011లో ఇంగ్లాండ్ లోని నాటింగ్ హోమ్ లో జరిగిన టెస్టు మ్యాచ్ లో  ఇయాన్ బెల్ రన్ ఔట్ లో ధోని వ్యవహరించిన క్రీడా స్ఫూర్తికి ఈ అవార్డ్ వచ్చిందని ఐసీసీ తెలిపింది. టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డును ఆఫ్ఘ‌నిస్థాన్ ప్లేయ‌ర్ ర‌షీద్ ఖాన్ సొంతం చేసుకున్నాడు.

విరాట్ కోహ్లి అవార్డు గెలిచిన‌ట్లు ప్ర‌క‌టిస్తూ ఈ ద‌శాబ్దంలో అత‌ను సాధించిన ప‌రుగులు, సెంచ‌రీలు, హాఫ్ సెంచ‌రీల‌ను ట్విట‌ర్‌లో షేర్ చేసింది ఐసీసీ. ఈ ద‌శాబ్దంలో కోహ్లి మొత్తం 20396 ప‌రుగులు చేయ‌గా, అందులో 66 సెంచ‌రీలు, 94 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 70కి పైగా ఇన్నింగ్స్ ఆడిన ప్లేయ‌ర్స్‌లో కోహ్లిదే (56.97) స‌గ‌టు కావ‌డం విశేషం. ఇక వ‌న్డేల విష‌యానికి వ‌స్తే ఐసీసీ అవార్డుల కాలంలో వ‌న్డేల్లో 10 వేల‌కుపైగా ప‌రుగులు చేసిన ఏకైక క్రికెట‌ర్ కోహ్లియే. అందులో 39 సెంచ‌రీలు, 48 హాఫ్ సెంచ‌రీలు ఉండ‌గా స‌గ‌టు 61.83.