ఉగ్రవాదుల చొరబాట్లకు పాక్ కొత్త దారులు 

భారత దేశంలోకి ఉగ్రవాదులను  చొరబాట్లకు పాకిస్థాన్ ఈ ఏడాది కొత్త దారులను ఎంచుకుంది. సాధారణంగా జమ్మూ-కశ్మీరు నుంచి ఉగ్రవాదులను పంపించే ప్రయత్నాలు చేస్తున్న చైనా, ఈ ఏడాది గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులను కూడా ఉపయోగించుకుంటోంది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) నివేదిక ప్రకారం 2020లో చొరబాటు యత్నాల సంఖ్య బాగా పెరిగింది. అయితే పాక్ పన్నాగాలు సఫలం కాకుండా బీఎస్ఎఫ్ కఠినంగా వ్యవహరిస్తోంది.

బీఎస్ఎఫ్ నివేదిక ప్రకారం, భారత దేశంలోకి ఉగ్రవాదులను పంపించేందుకు పాకిస్థాన్ గతంలో జమ్మూ-కశ్మీరు సరిహద్దులను ఉపయోగించుకునేది. ఇప్పుడు ఆ ప్రాంతంతోపాటు గుజరాత్, రాజస్థాన్ సరిహద్దుల గుండా కూడా పంపించేందుకు ప్రయత్నిస్తోంది. 

2019 నవంబరు మొదటి వారం వరకు గుజరాత్, రాజస్థాన్ సరిహద్దుల నుంచి ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు ఎక్కువగా లేవు. అంతకుముందు సంవత్సరం 4 చొరబాటు యత్నాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సైతం గుజరాత్, రాజస్థాన్ గుండా చొరబాటు యత్నాలు నమోదయ్యాయి. 

ఉగ్రవాదులను పంపించేందుకు పాకిస్థాన్ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ, బీఎస్ఎఫ్ ఆ ప్రయత్నాలన్నిటినీ విఫలం చేసింది. ఈ ఏడాది నవంబరు మొదటి వారం వరకు జమ్మూ-కశ్మీరు, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల గుండా 11 చొరబాటు యత్నాలు జరిగాయి. ఈ ఏడాది అత్యధికంగా జమ్మూ, పంజాబ్ సరిహద్దుల్లో చెరొక 4 చొరబాటు యత్నాలు జరిగాయి. జమ్మూ-కశ్మీరులోని సాంబ సెక్టర్‌లో 150 మీటర్ల పొడవైన సొరంగాన్ని నవంబరులో గుర్తించారు. ఈ సొరంగం గుండా ఉగ్రవాదులను పంపించాలనేది పాకిస్థాన్ వ్యూహం.