గగన్‌యాన్ కోసం గ్రీన్ ప్రొపల్షన్ రాకెట్

భారత్‌ తొలిసారిగా వచ్చే ఏడాదిలో చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర (గగన్‌యాన్‌)లో హరిత ఇంధనాన్ని వాడుతామని ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ తెలిపారు. ఈ యాత్రకోసం వినియోగించే పీఎస్‌ఎల్వీ రాకెట్ల కోసం గ్రీన్‌ ప్రొపల్షన్‌ను అభివృద్ధి చేసినట్టు ప్రకటించారు.

చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 16వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ భవిష్యత్తులో ఇస్రో నిర్వహించే దాదాపు అన్ని రాకెట్‌ ప్రయోగాల్లో గ్రీన్‌ ప్రొపల్షన్‌నే వాడుతామని చెప్పారు. విద్యార్థులు వైఫల్యాలకు భయపడకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇస్రో విజయ ప్రస్థానం వైఫల్యాలతోనే ప్రారంభమైందని గుర్తుచేశారు.

 ‘ఏ వైఫల్యమూ ఎదుర్కోని వ్యక్తి.. అసలు ఏ పనీ చేయటం లేదని అర్థం. జీవితంలో పూర్తిగా వైఫల్యం చెందటాన్ని నిరోధించాలంటే ఒక పద్ధతి ప్రకారం సాహసం చేయండి. ప్రతి వైఫల్యమూ గొప్ప పాఠమే అవుతుంది’ అని చెప్పారు. 

వైఫల్యాలు విలువైన పాఠాలు నేర్పుతాయని ఆయన పేర్కొన్నారు. భారత ఆర్థిక వృద్ధికి పర్యావరణం వల్ల నష్టం జరగకుండా హరిత సాంకేతికతను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఇస్రో తయారు చేసిన లిథియమ్ అయాన్ బ్యాటరీలను ఎలక్ట్రానిక్ వాహనాలకు విస్తృతంగా వినియోగించే వీలున్నదని ఆయన తెలిపారు. 

రాకెట్లు అంతరిక్షంలోకి దూసుకుపోవటానికి బూస్టర్లు అవసరం. నిర్ణీత దూరం ప్రయాణించిన తర్వాత బూస్టర్లు విడిపోతాయి. అప్పుడు రాకెట్‌ లోపల ఉండే ఘన, ద్రవ ఇంధనాలను మండించి సరైన దిశలో లక్ష్యం వైపు ప్రయాణించేలా చేస్తారు. ఈ బూస్టర్లను, రాకెట్‌లో ఉండే ప్రత్యేక ఇంధనాన్ని, దాన్ని మండించే వ్యవస్థను ప్రొపల్షన్లు అంటారు.

పీఎస్‌ఎల్వీ రాకెట్‌లో నాలుగు దశల ప్రొపల్షన్లు ఉంటాయి. జియో శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ (జీఎస్‌ఎల్వీ)లో మూడు దశలు ఉంటాయి. ప్రస్తుతం వాడుతున్న ప్రొపల్షన్ల వల్ల భారీగా వాయు కాలుష్యం ఏర్పడుతున్నది. దీనిని నిరోధించేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హిత ఇంధనాలను అభివృద్ధి చేస్తున్నారు.