జనతాదళ్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న నితీష్ 

జనతాదళ్(యూ) అధ్యక్ష పదవి నుంచి బీహార్ సీఎం నితీష్ కుమార్ తప్పుకున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి, రాజ్యసభ సభ్యులు రామచంద్ర ప్రసాద్ సింగ్ కొత్త అధ్యక్షునిగా ఎంపికయ్యారు. ఆదివారం జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో కొత్త అధ్యక్షుని ఎంపిక జరిగింది.

రామచంద్రప్రసాద్ 2010 నుండి రాజ్యసభ సభ్యునిగా ఉంటున్నారు. గతంలో నితీష్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయనకు నమ్మినబంటు అన్న పేరు ఉంది.

అందుకే పార్టీ ప్రక్షాళన ప్రస్తావన వస్తుండడంతో తాను తప్పుకుని తన స్థానంలో తనకు ముఖ్యుడైన రామచంద్రప్రసాద్ సింగ్ కు బాధ్యతలు అప్పగిస్తానని సీఎం నితీష్ ప్రతిపాదించగా,  దీన్ని ఇతర సభ్యులు కూడా ఆమోదించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తగిన సీట్లు గెలవలేకపోవడంతో జనతాదళ్ పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఏడుగురు ఎమ్మెల్యేలలో ఆరుగురు బీజేపీలో చేరడం పార్టీకి ఇబ్బందికరంగా మారిన నేపధ్యంలో పార్టీ ప్రక్షాళన చేయాలన్న డిమాండ్  మేరకు అధ్యక్ష బాధ్యతల నుండి నితీష్ తప్పుకుని తన స్థానంలో రామచంద్ర ప్రసాద్ సింగ్ ను తెరపైకి తెచ్చారు.