ఇప్పటికైనా రైతులు ఆందోళన విరమించండి 

ఇప్ప‌టికైనా రైతులు ఆందోళ‌న విర‌మించి ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు భార‌త ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి విజ్ఞప్తి చేశారు. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో జైరామ్ ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటై మూడేండ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. 

నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల ద్వారా రైతుల ఆదాయం రెట్టింప‌వుతుంద‌ని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అయితే, సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితాలు క‌నిపించ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. అందువ‌ల్ల రైతులు ఒక ఏడాదిన్న‌ర కాలం వేచిచూసి నూత‌న చ‌ట్టాల‌వ‌ల్ల వ‌చ్చే మార్పుల‌ను గ‌మ‌నించాల‌ని కోరారు. 

ఒక‌వేళ రైతుల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని భావిస్తే చ‌ర్చ‌ల ద్వారా చ‌ట్టాల్లో అవ‌స‌ర‌మైన మార్పులు చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని హామీ ఇచ్చారు. వ్య‌వ‌సాయం గురించి ఏ మాత్రం అవ‌గాహ‌న లేని వాళ్లు కూడా వ్య‌వ‌సాయ చ‌ట్టాలపై అస‌త్య ప్ర‌చారం చేస్తూ అమాయ‌క రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ధ్వజమెత్తారు.

పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ను నిలిపివేయాల‌నే ఉద్దేశం కేంద్రానికి ఏనాడూ లేద‌ని, భ‌విష్య‌త్తులో కూడా అలాంటిది జ‌రుగ‌ద‌ని ఆయ‌న స్పష్టం చేశారు. రైతుల నుంచి భూముల‌ను ఎవ‌రూ లాక్కోలేర‌ని మంత్రి చెప్పారు.