కశ్మీరి కుంకుమ పువ్వు ప‌రిమ‌ళాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తం చేద్దాం

ప్రపంచంలో కశ్మీరీ కేస‌ర్ (కశ్మీరీ కుంకుమ పువ్వు)కు ప్రత్యేక స్థానం ఉన్న‌దని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇతర దేశాల్లో లభించే కుంకుమ పువ్వుకు, కశ్మీర్‌లో ఉత్పత్తయ్యే కుంకుమ పువ్వుకు నాణ్యత విషయంలో చాలా తేడా ఉంటుంద‌ని చెప్పారు. మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో మాట్లాడిన ప్ర‌ధాని నాణ్యత విష‌యంలో ప్ర‌పంచంలో ల‌భించే ఇత‌ర అన్ని కుంకుమ పువ్వులకంటే కశ్మీర్‌ కుంకుమ పువ్వు చాలా విశిష్టమైన‌ద‌ని పేర్కొన్నారు.

కశ్మీరీ కుంకుమ పువ్వు ఇతర దేశాల్లో దొరికే కుంకుమ పువ్వుకు పూర్తిగా భిన్నమైనదని ప్ర‌ధాని తెలిపారు. దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ ఈ ఏడాదే వచ్చిందని, ఇక‌ అంతర్జాతీయ మార్కెట్లో ఈ పువ్వుకు న్యాయమైన స్థానం క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు. ఆత్మనిర్బర్ భారత్ పథకంలో భాగంగా దేశ ప్ర‌జ‌లు కశ్మీరీ కుంకుమ పువ్వును కొనాలని కోరారు. కశ్మీరి కుంకుమ పువ్వు గురించి అక్బ‌ర్ సంస్థానంలోని అబుల్ ఫ‌జ‌ల్ మొద‌టిసారి వ‌ర్ణించార‌ని ప్ర‌ధాని గుర్తుచేశారు.

ఈ కశ్మీరీ కుంకుమ పువ్వు జ‌మ్ముకశ్మీర్‌లోని పుల్వామా, బుద్గామ్‌, కిస్ట్‌వార్ ప్రాంతాల్లో ఎక్కువ‌గా పండుతుంది. ఈ పువ్వును పాయ‌సం, హ‌ల్వా, బిర్యానీ లాంటి వంట‌కాల్లో ఉప‌యోగిస్తారు. క‌శ్మీరీ కుంకుమ పువ్వును ఉప‌యోగించ‌డం ద్వారా వంట‌కాల‌కు చ‌క్క‌ని రంగు, రుచి రావ‌డంతోపాటు క‌మ్మ‌ని సువాస‌న‌లు వెద‌జ‌ల్లుతాయి. అందుకే క‌శ్మీరీ కుంకుమ పువ్వుకు అంత‌టి ప్ర‌త్యేక‌త ఉన్న‌ది.  

కాగా, దేశంలో తయారైన వస్తువులనే వినియోగించాలని  ప్రధాని  మోదీ  ఈ సందర్భంగా దేశ ప్రజలకు పిలుపిచ్చారు.  స్వయం సమృద్ధి, మేడిన్ ఇండియా వంటి అంశాలపై ఆయన మాట్లాడుతూ  భారత్ ను ప్లాస్టిక్ రహితంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.
 
దేశంలో తయారైన వస్తువులనే వినియోగించాలని ఆయన కోరారు. 2020లో వచ్చిన కరోనా కారణంగా ఎన్నో సమస్యలను , సవాళ్లను ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఝందేవాలా మార్కెట్‌లో ఒకప్పుడు విదేశీ ఆట వస్తువులే ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం ఈ మార్కెట్ లో  కేవలం దేశీయంగా తయారైన ఆట వస్తువులనే విక్రయిస్తున్నారని మోదీ వెల్లడించారు.  
 
సాహిబ్ జాదే, మాతా గుజ్రీ, గురు తేజ్‌ బహదూర్, గురు గోవింద్ సింగ్‌ వంటి వారి త్యాగాలు యువతకు ఆచరణీయమని, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.  దేశంలో 2014-18 మధ్య చిరుత పులుల సంఖ్య 60 శాతం పెరిగిందని, ప్రస్తుతం దేశంలో 12,852 చిరుత పులులు ఉన్నాయని చెప్పారు.