ఉత్తరాఖండ్ సిఎం త్రివేంద్రసింగ్ రావత్ కు కరోనా

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి  త్రివేంద్రసింగ్ రావత్‌ కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన్ను డెహ్రాడూన్‌లోని డూన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు.  నెల 18న ఆయన కరోనా బారినపడి హోంక్వారంటైన్ లో ఉన్నారు.
 
కరోనాతో బాధపడుతూ తాను ఆసుపత్రిలో చేరినట్టు త్రివేంద్రసింగ్ రావత్ స్వయంగా వెల్లడించారు. తనతోపాటు భార్య, కుమార్తె కు కూడా కరోనా సోకినట్టు రావత్ తెలిపారు. ప్రస్తుతం రావత్ జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఆదివారం ఆయనకు తీవ్రంగా జ్వరం రావడంతో డెహ్రాడూన్‌లోని డూన్‌ దవాఖానలో చేరారు. స్కానింగ్‌ చేసిన డాక్టర్లు ఆయన ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌ గుర్తించారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించారు.
ఇలా ఉండగా, రేపటి నుండి ప్రారంభం కానున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు పెద్ద షాకే తగిలింది. ఎందుకైనా మంచిదిలే అనుకుంటూ..కరోనా పరీక్షలు చేస్తే 66 మంది అధికారులు, సిబ్బంది, ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్‌ రామేశ్వర్‌ శర్మ మీడియాకు తెలియజేశారు. 
 
పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో 61మంది అధికారులు, ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు. ఇంకా కొంతమంది అధికారుల రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రస్తుతం వీరందరికీ సమావేశాలకు అనుమతి లేదు. వర్చువల్‌ విధానంలోనే వీరు పాల్గంటారు. మరోవంక, దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 18 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, తాజాగా అవి 20 వేలు దాటాయి. ఇది నిన్నటికంటే 9 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటీ 2 లక్షలకు చేరాయి.