యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కూటమితో యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. పోస్ట్–బ్రెగ్జిట్‌స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) ఇరు వర్గాలు గురువారం ఖరారు చేసుకున్నాయి. ఇందుకు తుది గడువు డిసెంబర్ 31 కాగా, వారం రోజుల ముందే ఒప్పందం కుదరడం విశేషం. ఇందుకు బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరం వేదికగా మారింది. ఇది అతిపెద్ద ద్వైపాక్షిక ఒప్పందమని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందం పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో బహిర్గతం కానున్నాయి.
ఒప్పందం కుదిరిన అనంతరం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్వేచ్ఛా సంకేతాన్ని ఇచ్చేలా గాల్లోకి చేతులు చాచి ఉన్న తన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. బ్రెగ్జిట్‌కు సంబంధించి ఇదివరకే చాలా అంశాలు కొలిక్కి వచ్చినప్పటికీ బ్రిటన్ ప్రాదేశిక జలాల్లో చేపల వేటపై చిక్కుముడి వీడలేదు. అయితే తాజా ఒప్పందం ప్రకారం బ్రిటన్ ప్రాదేశిక జలాల్లో చేపల వేటపై బ్రిటిష్ పౌరులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, ఎలాంటి పరిమితి లేదని బోరిస్ వెల్లడించారు.
ఎలాంటి టారిఫ్‌లు, నియంత్రణలు లేకుండా ఈయూ మార్కెట్‌లో బ్రిటన్ సరుకులు అమ్ముకోవచ్చని పేర్కొన్నారు. తాజా డీల్ బ్రిటన్, ఈయూ మధ్య దౌత్య సంబంధాల్లో స్థిరత్వాన్ని తీసుకొస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్ పూర్తవడంతో బ్రిటన్ యూరోపియన్ యూనియన్ కూటమి నుంచి అధికారికంగా వైదొలగనున్నది.
ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావాలని డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో 2013లో అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తమను మరోసారి ఎన్నికల్లో గెలిపిస్తే రెఫరెండం నిర్వహిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక 2016లో బ్రెగ్జిట్‌పై రెఫరెండం నిర్వహించారు. దీనికి 52 శాతం మంది అనుకూలంగా, 48 శాతం మంది వ్యతిరేకంగా ఓట్లేశారు.
ఒక స్వతంత్ర వాణిజ్య దేశంగా ఇకపై తమకు ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇతర భాగస్వామ్య దేశాలతో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి మార్గం సుగమమైందని యూకే అధికార వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. జీరో టారిఫ్‌లు, జీరో కోటాల ఆధారంగా ఈయూతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి.
ఇదొక పారదర్శక, బాధ్యతాయుతమైన ఒప్పందమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వన్‌డెర్ లెయెన్ అభివర్ణించారు. ఈయూకు యూకే దీర్ఘకాలిక భాగస్వామ్య దేశమని గుర్తుచేశారు. ఈయూ నుంచి విడిపోవడం కొంత బాధాకరమే అయినప్పటికీ, ఇది భవిష్యత్తు వైపు దృష్టి సారించాల్సిన సమయమని పేర్కొన్నారు.
More Stories
అల్లు అర్జున్ కు హైకోర్టులో మధ్యంతర బెయిల్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
అత్యంత శక్తిమంతమైన మహిళగా నిర్మలా సీతారామన్