బెంగాల్ లో ఉనికి కోసం కాంగ్రెస్, లెఫ్ట్ పొత్తు 

పశ్చిమ బెంగాల్ లో అనూహ్యంగా బిజెపి కీలకమైన రాజకీయ శక్తిగా ఎదగడంతో కోల్పోతున్న తమ రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసం వామపక్ష కూటమితో పొత్తు ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 2016 అసెంబ్లీ ఎన్నికలలో ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేసినా, గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఎవ్వరికీ వారుగా పోటీ చేశారు. 

 ‘‘పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల పోత్తును ఏర్పాటు చేసుకునేందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆమోదం తెలిపింది’’ అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో లోక్‌సభా ప్రధాన ప్రతిపక్ష నేత, బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి ప్రకటించారు’.

ఈ పొత్తు ఈ రెండు పార్టీల సైద్ధాంతిక దివాలాకోరు తనాన్ని కూడా వెల్లడి చేస్తున్నది. ఎందుకంటె పశ్చిమ బెంగాల్ తో పాటే కేరళ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. కేరళలో కాంగ్రెస్, సిపిఎం ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులు. వారిద్దరూ రెండు బలమైన రాజకీయ కూటములకు అక్కడ నేతృత్వం వహిస్తున్నారు. 

కేరళలో ఒకరినొక్కరు ఓడించుకోవడం కోసం, పరస్పరం ఆరోపణలు చేసుకొంటూ, బెంగాల్ లో మాత్రం ఇద్దరు కలసి చేతులు కలిపి నాలుగు సీట్లు గెల్చుకొనే ప్రయత్నం చేయడం వారి రాజకీయ అవకాశం వాదాన్ని వెల్లడి చేస్తున్నది. ఈ పొత్తు పట్ల కేరళ సిపిఎం నేతలు మొదటి నుండి విముఖత వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ కూటమితో జతకట్టి మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను 92 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. అయితే కాంగ్రెస్ కేవలం 12 శాతం ఓట్లతో 44 స్థానాలను గెలుచుకుంది. 200 పైగా స్థానాల్లో పోటీ చేసిన లెఫ్ట్ కూటమి 20 శాతం ఓట్లతో కేవలం 33 స్థానాల్లోనే గెలుపొందింది.  34 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన లెఫ్ట్ మూడో స్థానంకు వెళ్ళిపోయింది. 

44.91 శాతం ఓట్లతో 211 సీట్లు సాధించి మమతా రెండో సారి అధికారంలోకి రాగా, 10.16 శాతం ఓట్లతో బిజెపి మూడు సీట్లు మాత్రమే గెలుపొందింది. అయితే గత ఏడాది లోక్ సభ ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లెఫ్ట్ ఫ్రంట్ కేవలం 6.34 శాతం ఓట్లతో ఒక్క సీట్ కూడా గెలుపొందలేదు. పైగా 39 సెట్లలో డిపాజిట్లు కోల్పోయింది. కాంగ్రెస్ 5. 67 శాతం ఓట్లతో రెండు సీట్లు గెల్చుకొంది.  టిఎంసి 43.69 శాతం ఓట్లతో 22 సీట్లు గెలుపొందగా, దాదాపు సమానంగా 40.64 శాతం ఓట్లు పొందిన బిజెపి 18 సీట్లు గెల్చుకొంది.

  2016 అసెంబ్లీ ఎన్నికలు టీఎంసీకి కాంగ్రెస్, లెఫ్ట్ ప్రతిపక్షాల కూటమికి మధ్య జరిగాయి. కానీ, ఈసారి ఎన్నికలు టీఎంసీకి బీజేపీకి మధ్య జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 18 లోక్‌సభా స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 

ఇక ఓట్ బ్యాంక్ అయితే 40 శాతానికి పైగా సాధించింది. ఈ తరుణంలో లెఫ్ట్‌తో కలిసి కాంగ్రెస్ కడుతున్న కూటమి ఈసారి ఎన్నికల్లో మూడవ పక్షంగా ఉండనుంది. ఈ కూటమి ప్రభావం కూడా టీఎంసీ, బీజేపీలపై చాలా తక్కువగానే ఉండనుందనేది రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.