బ్రిటన్‌ ప్రయాణికుల్లో ఏడుగురికి పాజిటివ్‌  

డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు యుకె నుంచి, యుకె మీదుగా తెలంగాణకు 1200 మంది వచ్చారని, వారిలో 846 మందిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి ఈటెల రాజేందర్ కు  తెలిపారు. వీరిలో ఏ రకం వైరస్ ఉందో తెలుసుకోవడానికి సీసీఎంబీ ల్యాబ్ కి పంపామని చెప్పారు. 

వీరందరిని ప్రత్యేకంగా పరిశీలన చేస్తున్నామని, పాజిటివ్ వచ్చిన వారిని కలిసిన వారందరినీ ట్రేస్ చేస్తున్నట్లు తెలిపారు. కొత్త రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో..  ప్రజలందరూ అప్రమత్తంగా  ఉండాలని మంత్రి కోరారు. రాబోయే క్రిస్మస్, కొత్త ఏడాది, సంక్రాంతి వేడుకలు ఇంటికే పరిమితమై జరుపుకోవాలని సూచించారు. 

మాస్క్, సోషల్ డిస్టెన్స్, తరచూ చేతులు శుబ్రపరుచుకోవడం మరిచిపోవద్దని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులతో  మంత్రి ఈటల రాజేందర్. కొత్త రకం కరోనా వైరస్ తో  ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కనిపిస్తున్న సమయంలో రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరిపారు.

రెండు వారాలుగా యూకే నుంచి  రాష్ట్రానికి ఎవరెవరు వచ్చారన్నాదనిపై అధికారులు ఆరా తీస్తున్నారు.  ఇప్పటికే జిల్లా వైద్య అధికారులకు సమాచారం అందించి యూకే నుంచి వచ్చిన వారికి ప్రత్యేకంగా కరోనా టెస్టులు చేయిస్తున్నారు. యూకే రిటర్న్స్ కరోనా నెగెటివ్ వచ్చినా క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించారు. 

వాక్సిన్ మన రాష్ట్రానికి అందిన వెంటనే ప్రజలకు అందించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి  చెప్పారు.  వాక్సిన్ వేయడానికి పది వేల మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వీరంతా రోజుకు వంద మందికి టీకా వేస్తే పది లక్షల మందికి రోజుకి వాక్సిన్ వేయగలమని తెలిపారు. 

మొదటి దశలో 70 నుండి 80 లక్షల మందికి టీకా వేయడానికి ప్రణాళిక సిద్దం చేశామని తెలిపారు. హెల్త్, పోలీస్, మున్సిపల్, ఫైర్ సిబ్బందితో పాటు వయసు మీద పడిన వారికి మొదటి దశలో టీకా ఇవ్వనున్నారు. మొదటి డోసు వేసిన 28 రోజుల తరువాత రెండో డోసు వేయాలనీ, అందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ సిద్దంగా ఉంచామని తెలిపారు.