విశ్వ భారతి విశ్వవిద్యాలయం స్వాతంత్ర్యోద్యమ కాలంలో గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గదర్శకత్వంలో భారత దేశ జాతీయవాద దృక్పథానికి ప్రతీకగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత దేశపు ఆధ్యాత్మిక జాగృతి నుంచి యావత్తు మానవాళి లబ్ధి పొందాలని గురుదేవులు ఠాగూర్ ఆకాంక్షించారని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ విజన్ కూడా ఈ దృక్పథం నుంచే ఉత్పన్నమైందని చెప్పారు.
పశ్చిమ బెంగాల్‌లోని శాంతి నికేతన్‌లో ఉన్న విశ్వ భారతి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటూ విశ్వ భారతి విశ్వవిద్యాలయం స్థాపనకు దారి తీసిన పరిస్థితులను మనం గుర్తు చేసుకోవాలని సూచించారు.
కేవలం బ్రిటిష్ పరిపాలన మాత్రమే కాదని, వందల సంవత్సరాల ఉద్యమ చరిత్ర, సుసంపన్నమైన మన సిద్ధాంతాలు ఈ విశ్వవిద్యాలయం స్థాపన వెనుక ఉన్నట్లు ప్రధాని పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై పారిస్ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, విశ్వ భారతి నుంచి ఉద్బవించిన సందేశాన్ని మన దేశం యావత్తు ప్రపంచానికి అందిస్తోందని తెలిపారు.
భారత దేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పారిస్ ఒప్పందం ప్రకారం పర్యావరణ లక్ష్యాలను సాధించడంలో కేవలం మన దేశం మాత్రమే సరైన మార్గంలో నడుస్తోందని స్పష్టం చేశారు.
ఈ విశ్వవిద్యాలయంలో 1894 నుండి ప్రతి ఏడాది శీతాకాలంలో జరుపుతున్న `పుష్ మేళ’ (వృత్తి కళాకారుల సంత) ఈ ఏడాది కరోనా కారణంతో జరుపక పోవడంతో ఈ ప్రాంతంలోని వృత్తి కళాకారులు తమ ఉత్పత్తులను ఆన్ లైన్ లో అంతర్జాతీయ మార్కెట్ లో విక్రయించుకోవడం కోసం విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు సహకరించాలని ప్రధాని సూచించారు.
విశ్వ భారతి విశ్వవిద్యాలయం వందేళ్ళ ప్రయాణం చాలా ప్రత్యేకమైనదని పేర్కొంటూ భారత మాత కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనలు, విజన్, కఠోర శ్రమలకు నిజమైన రూపం విశ్వభారతి విశ్వవిద్యాలయమని చెప్పారు. భారత దేశానికి ఇది ఆరాధనీయమైన, ఆదరణీయమైన ప్రదేశమని తెలిపారు. గురుదేవ్ ఠాగూర్ కలలకు రూపమివ్వడానికి దేశానికి ఈ ప్రదేశం నిరంతరం శక్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ 1921లో స్థాపించిన విశ్వ భారతి విశ్వవిద్యాలయాన్ని మన దేశంలోని ఓల్డెస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ. 1951 మే నెలలో పార్లమెంటు చట్టం ద్వారా ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర విశ్వవిద్యాలయంగా ప్రకటించారు. ఈ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా ప్రధాన మంత్రి వ్యవహరిస్తారు.
More Stories
జాతీయ రహదారులపై క్లీన్ టాయిలెట్స్, బేబీ కేర్ రూమ్స్
50 మంది సీనియర్ డాక్టర్ల మూకుమ్మడి రాజీనామా
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం