ప్ర‌జాస్వామ్యంపై విశ్వాసం రుజువైంది

జమ్మూక‌శ్మీర్‌లో ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ప్రశంసించారు. డీడీసీ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం కట్టబెట్ట‌డంపై జమ్ముకశ్మీర్‌ ప్రజలకు అమిత్‌షా ధన్యవాదాలు తెలిపారు. 
 
జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉందని రుజువైంద‌ని పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతంలో అట్ట‌డుగుస్థాయిలో ప్ర‌జాస్వామ్యాన్ని పున‌రుద్ధ‌రించేందుకు మోదీ ప్ర‌భుత్వం అన్ని విధాల కృషి చేస్తునట్లు చెప్పారు. 
 
కాగా, ఏకంగా 49 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. మరొక సీట్లో కూడా వారే ఆధిక్యంలో ఉన్నారు. ఈ 50 మందిలో అత్యధికులు తమనే సమర్థిస్తున్నారని బీజేపీ చెబుతోంది. ‘74 సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇది ఉగ్రవాదులకు, వారిని సమర్థించే పార్టీలకు గట్టి చెంప దెబ్బ’ అని బిజెపి స్పష్టం చేసింది. 
 
పైగా,  ఉగ్రవాద నేత బుర్హన్‌ వానీని అంతర్జాతీయ స్థాయిలో ఈ పార్టీలు (గుప్కార్‌ గ్యాంగ్‌) కీర్తించాయి. ఇపుడు కశ్మీరీలు మాకే మెజారిటీ కట్టబెట్టారని బీజేపీ పేర్కొన్నది. బీజేపీకి పడ్డ మొత్తం ఓట్లు- 4,87,364. ఇది నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (2,82,514), పీడీపీ (57,789), కాంగ్రెస్‌ (1, 39,382) పార్టీలకు పడ్డ మొత్తం ఓట్ల కన్నా ఎక్కువ.