ఎస్సీలకు రూ 59 వేల కోట్ల పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ లు 

ప్రధాని నరేంద్ర  మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం  ఎస్సీ విద్యార్థుల పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం రూ.59,048 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో 60 శాతం నిధుల్ని (రూ.35,534 కోట్లు) కేంద్ర ప్రభుత్వం భరించనుండగా, మిగతా 40 శాతం నిధుల్ని (రూ.23,514 కోట్లు) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయాలి.
 
పదో తరగతి పూర్తయ్యాక, ఆర్థిక ఇబ్బందులతో దాదాపు 1.36 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులు కళాశాల విద్యకు దూరమయ్యారని, వచ్చే ఐదేండ్లలో వాళ్లందరికీ ఉన్నత విద్యను అందించడానికి ప్రయత్నిస్తున్నామని వివరించింది. మరోవైపు, దేశంలో డైరెక్ట్‌ టూ హోం (డీటీహెచ్‌) సర్వీసులకు సంబంధించిన మార్గదర్శకాల్లో కేంద్రం కీలక సవరణలు చేసింది. ఇకపై ఆయా సర్వీసు సంస్థలకు 20 ఏండ్ల పాటు లైసెన్సులను ఇవ్వబోతున్నట్టు వెల్లడించింది.
కాగా, కేంద్ర సమాచారశాఖ కింద ఉన్న నాలుగు ప్రభుత్వ ఫిల్మ్‌ మీడియా విభాగాలు ఫిల్మ్స్‌ డివిజన్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌, నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా, చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ సొసైటీలను.. నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎఫ్‌డీసీ)లో విలీనం చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.