వెంకటస్వామి ఓ పోరాట యోధుడు  

జనం మెచ్చిన దళిత నాయకుడు మన గడ్డం వెంకటస్వామి. అందరూ ముద్దుగా ‘కాకా’ అని పిలుచుకునే వెంకటస్వామి ఓ పోరాట యోధుడు, రాజకీయ దురంధరుడు. పేదలు, కార్మికుల పక్షాన పోరాటం చేసిన ఆయన గుడిసెల వెంకటస్వామిగా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన 6వ వర్ధంతి నేడు. ఆ సందర్భంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌లు ట్యాంక్ బండ్ మీద ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. 
 
 ‘వెంకట స్వామి గారు తెలంగాణా కోసం నిత్యం పోరాడిన వ్యక్తి. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కూడా కొట్లాడారు’ అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
 
పార్టీలను, రాజకీయ నాయకులను తెలంగాణ కోసం ఏకం చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు అనేక జిల్లాలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు’ అంటూ కిషన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.

పేద వారికి గుడిసెలు వేయించడంతో ఆయనకు గుడిసెల వెంకటస్వామిగా దేశవ్యాప్తంగా పేరొచ్చిందని చెబుతూ  పేద ప్రజల గుండెల్లో ఆయన చిరకాలం నిలిచిపోతారని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల కోసం యాజమాన్యాలతో పోరాడిన గొప్ప నేత,  కార్మిక నాయకుడు అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో ఎంపీలందరికీ వెంకటస్వామి దిశ నిర్దేశం చేశారని ఆయన కుమారుడు, మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు వివేక్ వెంకటస్వామి తెలిపారు. ‘మా నాన్న గారి ఆశయ సాధనలో భాగంగా మేం ముందుకు వెళ్తాం’ అని చెప్పారు. 
 
కార్మికులకు పింఛన్‌లు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వారికి పీఎఫ్, పేదల కోసం అన్నపూర్ణ క్యాంటిన్‌ల ఏర్పాటుతో పాటు ఇళ్లులేని నిరుపేదలకు గుడిసెలు వేయించిన మహానేత కాకా. పేద విద్యార్థుల కోసం అంబెడ్కర్ కాలేజీని ఏర్పాటు చేశారని వివరించారు.