కేసీఆర్ ది రైతులపై దొంగ ప్రేమ 

సీఎం కేసీఆర్ రైతులపై దొంగ ప్రేమ చూపుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.  కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై బీజేపీ నేతృత్వంలో ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ   జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న సీఎం కేసీఆర్ రైతుల పక్షాన బంద్‌ నిర్వహించారని ధ్వజమెత్తారు. 

ఆ బంద్ లో రాష్ట్రంలో రైతులు ఎవరూ పాల్గొనలేదని గుర్తు చేశారు. ఆ తర్వాతనే ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ బీజేపీ అగ్ర నేతలకు వంగి వంగి దండాలు పెట్టి వచ్చారని ఎద్దేవా చేశారు. రైతుల మీద ప్రేమ ఉంటే ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నా వద్దకు ఎందుకు పోలేదని ప్రశ్నించారు. 

నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని సంజయ్ స్పష్టం చేశాన్నారు. రైతులు తాము పండించిన పంటను ఎక్కువ ధరకు ఎక్కడైనా అమ్ముకోవచ్చని పేర్కొన్నారు. 

కాగా,  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫౌంహౌ్‌సలో కాలక్షేపం చేస్తూ రాత్రి సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని హితవు చెప్పారు. పగటి పూట నిర్ణయాలు తీసుకుంటేనే ప్రజలు స్వాగతిస్తారని చెప్పారు. 

తెలంగాణ కోసం అవుసులుబాసిన అమరుల ఆశయాలను నెరవేర్చేందుకు మలిదశ ఉద్యమాన్నీ చేపడతామని సంజయ్ వెల్లడించారు.   అహంకారంతో సాగుతున్న కుటుంబ పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. నారాయణ పేటలో నిర్వహించిన సదస్సులో కేంద్ర బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.