కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ ఓరా కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ ఓరా కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మోతీలాల్ ఓరా కన్నుమూశారు. 93 ఏళ్ల ఆయన ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఇవాళ కుటుంబ సభ్యులు వెల్లడించారు. మూత్రకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఓరాను కొద్దిరోజుల క్రితం ఓక్లాలోని ఎస్కాట్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
 
శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తడంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సరిగ్గా ఆదివారం నాటికి 93 ఏళ్లు పూర్తిచేసుకున్న ఓరా పుట్టినరోజు తెల్లారే తుదిశ్వాస విడవడం గమనార్హం. 1927 డిసెంబర్ 20న మోతీలాల్ ఓరా జన్మించారు. రెండుసార్లు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 
 
తొలుత సమాజ్వాదీ పార్టీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఓరాకు పేరుంది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఆయన ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 
 
ఇటీవల సోనియా గాంధీ పార్టీ ప్రక్షాళన చేపట్టే వరకు కాంగ్రెస్ పార్టీ ఐఏసీసీ పరిపాలనా వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఓరా సేవలు అందించారు. తరుణ్ గొగోయ్, అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీ సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలు ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే.  మో
తీలాల్ ఓరా మృతి పట్ల ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిపాలనా పరంగా, సంస్థాగత వ్యవహారాల పట్ల ఆయనకు విశేష అనుభవం ఉందంటూ ప్రధాని కొనియాడారు.
‘‘కాంగ్రెస్‌లోని అత్యంత సీనియర్ నేతల్లో మోతీలాల్ ఓరా ఒకరు. కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ ప్రస్థానం సాగించిన ఆయనకు.. పరిపాలనా పరంగానూ, సంస్థగత వ్యవహారాల్లోనూ విశేష అనుభవం ఉంది. ఆయన మృతి నన్ను తీవ్రంగా బాధించింది. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి…’’ అని ప్రధాని మోదీ పేరుతో పీఎం కార్యాలయం ట్వీట్ చేసింది.

కాగా మోతీలాల్ ఓరా మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఓరా నిజమైన కాంగ్రెస్ నాయకుడనీ, అద్భుతమైన వ్యక్తిత్వం కలిగినవారని కొనియాడారు. ఓరా మృతిపై రాహుల్ స్పందిస్తూ… ‘‘ఓరాజీ ఓ నిజమైన కాంగ్రెస్ నాయకుడు. అద్భుతమైన వ్యక్తి. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి…’’ అని ట్వీట్ చేశారు.