టిఎంసిలో చేరిన భార్యకు బిజెపి ఎంపీ విడాకులు!

ప‌శ్చిమ బెంగాల్‌లో టీఎంసీలో చేరిన భార్య సుజాత మండ‌ల్ ఖాన్‌కు విడాకులు ఇస్తానని బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ ప్రకటించారు. తన కుటుంబాన్ని చీల్చినందుకు టీఎంసీ సిగ్గుపడాలని ఆయన విమర్శించారు. సుజాత ఇప్పటి వరకు బీజేపీ ఎంపీ భార్యగా గౌరవం పొందారని చెబుతూ ఇకపై తన పేరు, ఇంటి పేరు నుంచి ఆమెకు విముక్తి ఇస్తున్నానని మీడియా సమావేశంలో వెల్లడించారు.

పైగా, ఆమె కావాలంటే తన  ఆస్తిని తీసుకోవచ్చని లేకపోతే  ప్రజలకు దానం చేస్తానని ఆయన చెప్పారు.  టీఎంలో చేరి తన భార్య తప్పు చేసిందని బిష్ణుపూర్ నియోజకవర్గం రాష్ట్ర యువమోర్చ అధ్యక్షుడు కూడా అయిన సౌమిత్ర ఖాన్ ఆవేదనగా పేర్కొన్నారు.  ‘నేను అభిషేక్ బెనర్జీకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సుజాత నా ఏకైక బలహీనత. ఇప్పుడు నేను నా పార్టీ బీజేపీ కోసం అన్నింటినీ త్యాగం చేస్తాను’ అని వ్యాఖ్యానించారు. అలాగే తన భార్య సుజాతకు విడాకుల నోటీసు పంపిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

‘నేను విడాకుల నోటీసు పంపుతాను. నేను టీఎంసీతో  పోరాడతాను. నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినందుకు మీరు సిగ్గుపడాలని టీఎంసీకి చెప్పాలనుకుంటున్నాను. చాలా పోరాటాలు జరిగాయి, కానీ ఇది జరుగుతుందని అనుకోలేదు’ అని సౌమిత్ర ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

తమ కుటుంబాన్ని విడదీసిన వారి క్షమించబోనని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ పార్టీని రాష్ట్రం నుండి తరిమివేస్తారని ఆయన సవాల్‌ చేశారు.  సుజాత మండ‌ల్ ఖాన్ సోమవారం తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఎంపీ సౌగ‌త రాయ్‌, అధికార ప్ర‌తినిధి కునాల్ ఘోష్ ఆమెను తమ పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన సుజాత బీజేపీ కోసం తాము ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌ని చేశామని, కానీ ఆ పార్టీలో గౌర‌వం లేకుండా పోయిందని విమర్శించారు. అవినీతిప‌రుల‌కు గాలం వేసి బ‌ల‌ప‌డేందుకు బీజేపీ య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు. మ‌మ‌తా బెన‌ర్జీ కోసం ప‌ని చేయ‌డం ఒక మ‌హిళ‌గా త‌న‌కు గౌర‌వం ఉంటుంద‌ని తాను భావిస్తున్నానని తెలిపారు.