చెక్కుల ద్వారా జరిపే చెల్లింపుల్లో మోసాల కట్టడి 

 
చెక్కుల ద్వారా జరిపే చెల్లింపుల్లో మోసాలను అరికట్టేందుకు రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) జనవరి 1 నుంచి ‘పాజిటివ్‌ పే’ అనే నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నది. దీంతో చెక్కుల ద్వారా మరింత సురక్షితంగా లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలవుతుంది. 
 
సాధారణంగా చెక్కు, దానిపై ఉన్న ఖాతాదారుని సంతకం నిజమైనవి అయితేనే బ్యాంకులు ఆ చెక్కును మంజూరు చేస్తాయి. కానీ చెక్కు వివరాలను మార్చి మోసాలకు పాల్పడుతున్న అక్రమార్కుల లీలలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. 
 
ఇలాంటి మోసాలను నిలువరించేందుకే ‘పాజిటివ్‌ పే’ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఆర్బీఐ నోటిఫికేషన్‌ ప్రకా రంరూ.50 వేలు, అంతకంటే ఎక్కువ మొత్తానికి జారీచేసిన చెక్కులను పునర్‌ సమీక్షించాల్సి ఉంటుంది. ఇది బ్యాంకులు, వినియోగదారులపై ఆధారపడి ఉంటుంది. 
 
అయితే రూ.5 లక్షలు, ఆపై మొత్తాలకు జారీచేసిన చెక్కులను బ్యాంకులు తప్పనిసరిగా పునర్‌ సమీక్షించాలి.  నియోగదారులు ఎవరికైనా చెక్కులు ఇస్తే ఆ వివరాలను బ్యాంకులకు తెలియజేయాల్సి ఉంటుంది.  చెల్లింపులు చేసే ముందు బ్యాంకులు ఆ చెక్కులో పొందుపర్చిన వివరాలను వినియోగదారుడు తెలిపిన వివరాలతో పోల్చి చూస్తాయి. అన్ని వివరాలు సరిపోలితే చెక్కును మంజూరు చేస్తాయి.  
 
ఆర్బీఐ నోటిఫికేషన్‌ ప్రకారం చెక్కు ఇచ్చేవారు ఎస్‌ఎంఎస్‌, మొబైల్‌ యాప్‌, ఇంటర్నెట్‌, ఏటీఎం లాంటి ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఆ చెక్కు వివరాలను బ్యాంకులతో పంచుకోవాలి. చెక్కు జారీచేసిన వ్యక్తి లేదా సంస్థ పేరు, నగదు విలువ, చెక్కు నంబరు, జారీచేసిన తేదీ వివరాలను బ్యాంకులకు తెలియజేయాలి. 
 
ఆ తర్వాత ఈ వివరాలను బ్యాంకులు తమ సెంట్రలైజ్డ్‌ డాటా సిస్టమ్‌లో అప్‌లోడ్‌ చేస్తాయి. చెక్కును స్వీకరించిన తర్వాత దాని వివరాలను డాటా బేస్‌ ధ్రువీకరిస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా బ్యాంకులు రెండుసార్లు చెక్కులను పరిశీలిస్తాయి. చెక్కుపై ఉన్న సంతకం సరిపోలితే అందులోని వివరాలతో మరోసారి ధ్రువీకరిస్తుంది.
 
చెక్కు జారీచేసిన తర్వాత వివరాలను బ్యాంకుతో పంచుకున్నప్పటికీ మోసపూరిత చెక్కును బ్యాంకు మంజూరుచేస్తే దానికి ఆ బ్యాంకే పూర్తిగా బాధ్యత వహించాలి.