భారత్‌లో మరోసారి కరోనా తీవ్రత ఉండక పోవచ్చు

భారత్‌లో రెండోసారి కరోనా ఉధృతి ఉండక పోవచ్చని, ఒక వేళ వచ్చినా మొదటి సారి వచ్చినంత తీవ్రంగా ఉండక పోవచ్చని వైద్య నిపుణులు అంచనాగా చెప్పారు. దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు, మరణాల శాతం తగ్గినా మొత్తం కేసుల సంఖ్య కోటికి చేరువగా ఉండడంతో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. 

సెప్టెంబర్ మధ్య కాలం కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ అప్పటి నుంచి రోజువారీ కేసుల నమోదు తగ్గుతోందని ప్రఖ్యాత వైరాలజిస్టు డాక్టర్ షాహిద్ జమీల్ పేర్కొన్నారు. గత సెప్టెంబర్ మధ్యకాలంలో రోజుకు 93 వేల కేసులు నమోదౌతుండేవని, ఇప్పుడు రోజుకు 25,500 కు మించి లేవని ఆయన ఉదహరించారు.

ప్రఖ్యాత క్లినికల్ సైంటిస్టు డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. తొలిసారి వ్యాప్తి చెందినట్టుగా రెండోసారి కరోనా వ్యాప్తి ఉండక పోవచ్చని ఆయన పేర్కొన్నారు. మనం ఇప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ శక్తిని సమకూర్చుకున్నందున ఆందోళన చెందవలసిందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

దేశంలో ఇంకా 30 నుంచి 40 శాతం మంది అసలు కరోనా సోకని వారున్నారని డాక్టర్ కెకె అగర్వాల్ చెప్పారు. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 15 దేశాల్లో భారత్, అర్జెంటైనా, పోలెండ్‌ల్లో రెండోసారి కరోనా ప్రభావం చూపించలేదని ఉదహరించారు. 

ఈ నెలాఖరుకు భారత్ వ్యాక్సినేషన్ ప్రారంభిస్తే 30 కోట్ల మందికి వ్యాక్సిన్ పూర్తి చేస్తే మార్చి 25 నాటికి కరోనాను పూర్తిగా నియంత్రించే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఐసిఎంఆర్ ఎపిడెమియోలజీ, కమ్యూనికబుల్ డిసీజెస్ అధినేత డాక్టర్ శామిరన్ పండా కొన్ని రాష్ట్రాలో ఈ కరోనా వైరస్ తగ్గిందని, మరి కొన్ని రాష్ట్రాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తోందని వివరించారు.