మిస్సైల్‌ కంటే మొబైల్‌ యాప్ లతోనే ముప్పు   

మనిషి చేతుల్లోని సెల్‌ఫోన్ ఇప్పుడు మిస్సైల్ కన్నా అత్యంత సమర్థవంతం అయి కూర్చుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశాల మధ్య ప్రచ్ఛన్న పోరుకు ఇప్పుడు వేదికలవుతున్న సోషల్ మీడియాలు , వాటిని చలితం చేస్తున్న సెల్‌ఫోన్ల గురించి ప్రస్తావించారు.  

దేశాల మధ్య సంక్షోభాలపై సోషల్‌ మీడియా ప్రభావం నేపథ్యంలో టెక్నాలజీ యుగంలో మిస్సైల్‌ కంటే మొబైల్‌ ఫోన్‌ పెద్దదని రక్షణ మంత్రి పేర్కొన్నారు. మిస్సైళ్ల కంటే వేగంగా దూసుకెళ్లగల సామర్థ్యం గల మొబైల్‌ ఫోన్‌ యాప్‌‌లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

కాలం మారుతున్నా కొద్దీ యుద్దాల ముప్పు స్వభావం మారుతున్నదని చైనా పేరెత్తకుండానే ఈ వ్యాఖ్యలు చేశారు. చండీగఢ్‌లో జరిగిన మిలిటరీ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడుతూ దీనివల్ల భవిష్యత్‌లో విభిన్న రకాల భద్రతా ముప్పు పొంచి ఉందని రాజ్‌నాథ్‌ హెచ్చరించారు.

మన శత్రువులు సరిహద్దులను దాటకుండానే ప్రజలను చేరుకోవచ్చునని అభిప్రాయ పడ్డారు. కనుక ప్రతి ఒక్కరూ ఒక సైనికుడి పాత్ర పోషించాలని అభ్యర్థించారు. సోషల్‌ మీడియాతో పొంచి ఉన్న ముప్పును గుర్తించి, తప్పుడు ప్రచారాల నుంచి మనతోపాటు ఇతరులను కాపాడుకోవాలని హితవు చెప్పారు.

ఇందుకోసం సాహితీవేత్తలు తమ ప్రతిభాపాటవాలను సద్వినియోగం చేయాలని పిలుపునిచ్చారు. తూర్పు లఢక్‌ వద్ద దేశ సరిహద్దుల వెంబడి చైనా సైన్యం చొచ్చుకురావడంతో ఇరు దేశాల సైన్యాలు ఘర్షణకు దిగాయి. దీంతో దేశంలో చైనా మొబైల్‌ యాప్‌ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.