మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని త్రోసిరాజి అధికారంలోకి రావడంకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిజెపి అధిష్టానం ఇప్పుడు ఆ బాధ్యతను ఆరుగురు కేంద్ర మంత్రులకు అప్పజెప్పింది. ఇప్పటికే అధికార టిఎంసిలో కీలక నేతలను తన వైపుకు తిప్పుకొంటూ మమతా బెనర్జీకి ని ద్రలేకుండా చేస్తున్న బిజెపి తన పట్టును మరింతగా బింగించేందుకు ప్రయత్నం చేస్తున్నది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్లదాడి తర్వాత బీజేపీ తన ఎత్తుగడలను మరింత ఉధృతం కావిస్తున్నది. ఇటు రాజకీయంగా, అటు పరిపాలనా పరంగా మమతా బెనర్జీని అష్టదిగ్బంధనం చేస్తూ వస్తున్నది. ఇప్పటికే ప్రతి నెలకోసారి అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి షా బెంగాల్ లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.
అంతేకాకుండా తృణమూల్ లో అసంతృప్త ఎమ్మెల్యేలకు గాలం వేసి, మమతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వీటన్నింటితో పాటు బీజేపీ అధిష్ఠానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు ముగిసే వరకూ బెంగాల్ లో ప్రచారం, పర్యటన చేస్తూనే ఉండాలని ఆరుగురు కేంద్ర మంత్రులకు బాధ్యతలను పురమాయించింది.
గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ ముండా, ప్రహ్లాద్ పటేల్, సంజీవ్ బలియన్, నిత్యానంద రాయ్, మన్సుక్ మాండవ్యాలను వివిధ లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా నియమించింది. ఒక్కొక్కరికి 5 పార్లమెంట్ నియోజకవర్గాలను అప్పగించింది. ఎన్నికలు ముగిసే వరకూ బాధ్యతలు అప్పజెప్పిన నియోజకవర్గాల్లో ఉధృతంగా పర్యటించాలని, క్షేత్ర స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉండాలని అధిష్ఠానం ఆ ఐదుగురికీ సూచించింది.
ప్రతి నెలకోసారి వారికి అప్పగించిన నియోజకవర్గాల్లో పర్యటించాలని, పర్యటించిన ప్రతిసారీ 15 రోజుల పాటు అక్కడే మకాం వేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కీలకమైన సమస్యలు, పార్టీ పటిష్టత, విస్తరణపైనే దృష్టిసారించాలని ఈ ఆరుగురినీ బీజేపీ అధిష్ఠానం ఆదేశించింది.
More Stories
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన ప్రధాని మోదీ
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి