అన్నదాత ఇంట్లో అన్నం తిన్న అమిత్ షా

రెండు రోజుల పశ్చిమ బెంగాల్  సందర్శనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఒక రైతు ఇంట్లో భోజనం చేశారు. పశ్చిమ్‌  మెడినిపూర్ జిల్లాలోని బెలిజూరి గ్రామానికి చెందిన అన్నదాత ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించారు. 

బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు  దిలీప్ ఘోష్‌తో కలిసి భోజనం చేశారు. ఓ వైపు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పలు రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు. 

మరోవైపు కొందరు రైతుల మద్దతు పొందేందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా ఒక రైతు ఇంట్లో భోజనం చేయడం గమనార్హం. శ‌నివారం తెల్ల‌వారుజామున 1:30 గంట‌ల‌కు కోల్‌ క‌తా చేరుకున్న విషయాన్ని ఆయనే ట్వీట్ చేశారు.

కోల్‌ క‌తాకు చేరుకున్నాను. గురుదేవ్ ఠాగూర్‌, ఈశ్వ‌ర్ చంద్ర విద్యాసాగ‌ర్‌, శ్యామ్ ప్ర‌సాద్ ముఖ‌ర్జీ వంటి గొప్ప నాయ‌కుల గ‌డ్డ మీద అడుగుపెట్టిన సంద‌ర్భంగా ఈ భూమికి న‌మ‌స్క‌రిస్తున్నానని ట్వీట్ చేశారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమిత్ షా శనివారం కోల్‌ క‌తాలోని స్వామి వివేకానంద విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. రామ‌కృష్ణ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు.

ఇటీవ‌ల‌ తృణ‌మూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కీల‌క‌ నేత సువేందు అధికారి అమిత్‌షా సమక్షంలో లో మిడ్నాపూర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో బీజేపీలో చేరారు. త‌న‌తోపాటు మ‌రో 10 టీఎంసీ ఎమ్మెల్యేలు కూడా టీఎంసీని వీడి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సంద‌ర్భంగా సువేందు మాట్లాడుతూ.. ‘‘నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు అమిత్‌షాకు ధన్యవాదాలు. నాకు బీజేపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. టీఎంసీ నాయకత్వం నన్ను బాగా అవమానాలకు గురిచేసింది.’’ అని మండిపడ్డారు. 

 అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీలో చేరిన బెంగాల్‌ ఎమ్మెల్యేల్లో సువేందు అధికారి, తాప‌సి మండ‌ల్‌, అశోక్ దిండా, సుదీప్ ముఖ‌ర్జి, సైక‌త్ పంజా, షిభ‌ద్ర ద‌త్త‌, దీపాలి బిశ్వాస్‌, సుక్రా ముండా, శ్యామ‌ప్ద ముఖ‌ర్జి, విశ్వ‌జిత్ కుందు, బ‌న‌శ్రీ మైతీ ఉన్నారు.