ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని, అది అమరావతే  

ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని అని, అది అమరావతే అని బీజేపీ స్పష్టం చేసింది. అమరావతి రాజధాని ఉద్యమానికి బీజేపీ పూర్తిగా మద్దతిస్తుందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి, రాష్ట్ర కార్యాలయ ఇన్ ఛార్జ్  వామరాజు సత్యమూర్తి స్పష్టం చేశారు. 

అమరావతి రాజధాని ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా ‘అమరావతి జేఏసీ’ ఆధ్వర్యంలో జరిగిన  ‘జనభేరీ’’ లో బీజేపీ ప్రతినిధిగా సత్యమూర్తి ప్రసఇంగిస్తూ . మనసా వాచా కర్మనా, త్రికరణశుద్ధిగా అమరావతి రాజధానిగా ఉండాలని తాము విశ్వసిస్తున్నామని వెల్లడించారు. 

ఆఖరి రైతుకు న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందని సత్యమూర్తి హామీ ఇచ్చారు. ఆయన ప్రసంగం సారాంశం: 

365 రోజులుగా ఈ ఉద్యమాన్ని నిరాటంకంగా సాగిస్తున్న సోదర సోదరీమణులకు, అందరి పోరాట పటిమకు బీజేపీ తరపున సాష్టాంగ నమస్కారం చేస్తున్నా.  ఉద్యమానికి బీజేపీ తరపున మద్దతు తెలపడానికి బీజేపీ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చా. 

ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు? పాదయాత్ర చేస్తూ రోడ్డుమీద ఉన్నారు. మనం ఇళ్లలో ఉన్నాం. ఈ రోజు ఆయన్ను గెలిపించిన తర్వాత ఆయన మనల్ని రోడ్డుమీద పడేశారు. ఆయన హాయిగా ఏసీ గదుల్లో ఉన్నారు. ఇలా ప్రజలను రోడ్డుమీద పడేసిన జగన్‌కు గుణపాఠం నేర్పాల్సిందే. 

ఈ రోజు విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. చిల్లుకుండను నెత్తిమీద పెట్టుకున్నాం. అలాంటి కుండను నెత్తిన పెట్టుకొని మనం బాధపడినా లాభం లేదు. మన కన్నీరు ఎవరికీ కనిపించదు. మనం ఏడుస్తున్నామని కనీసం సానుభూతి ప్రకటించే స్థితిలో కూడా లేరు. కాబట్టి ఈ చిల్లుకుండను ఎంత తొందరగా దించుకుంటే అంత మంచిది.

 ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. మన జెండాలు వేరైనా . అజెండా ఒక్కటే. అమరావతికి ఒకటే రాజధాని ఉంటుంది. అది అమరావతే ఉండాలి. ఈ నినాదంతోనే బీజేపీ ముందుకు సాగుతుంది. అమరావతి ఉద్యమానికి పూర్తి మద్దతిస్తాం. త్రికరణ శుద్ధిగా అమరావతి ఉద్యమం వెంట ఉంటాం.