మతం పేరుతో అరాజకం, విభజన రేఖలు సహించం 

మతం పేరుతో అరాచకం సృష్టించడం, విభజన రేఖలు గీయడాన్ని తాము ఎంత మాత్రమూ సహించమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా స్పష్టం చేశారు. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్‌ సేనలను ఓడించిన సందర్భంగా ఇండియా, బంగ్లాదేశ్‌లు ఆ రోజును విజయ దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. 

ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు షేక్ హసీనా కీలక సందేశాన్ని ఇవ్వడంతో పాటే మతతత్వవాదులకు గట్టి హెచ్చరిక చేశారు. ‘‘ఈ బంగ్లాదేశ్.. లాలోన్ షా, రవీంద్ర ఠాగూర్, కజి నజ్రుల్, జిబాననందల బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్.. షాహ్జాలాల్, షా పరోన్, షా మొక్దుమ్, కంజహాన్ అలీల బంగ్లాదేశ్”అని గుర్తు చేశారు.

ఈ బంగ్లాదేశ్ షేక్ ముజిబ్‌తో పాటు 16.5 కోట్ల బెంగాలీల బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ అందరిదీ. ఇక్కడ మతం పేరుతో అరాచకం సృష్టించడం, విభజన రేఖలు గీయాలనుకునే వారికి తావు లేదు. అలాంటి ప్రయత్నాలను బంగ్లాదేశ్ ఎంత మాత్రమూ సహించదని ఆమె హెచ్చరించారు. రాజకీయాలకు మతాన్ని పావుగా వాడుకోవద్దని 1972లో జాతి పిత (షేక్ ముజీబర్ రెహ్మాన్) చెప్పారు. కానీ కొందరు 50 ఏళ్ల క్రితం దీన్ని మతం ఆధారంగా విడగొట్టాలని చూశారు. మళ్లీ 50 నాటి పరిస్థితులకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

‘‘బంగ్లాదేశ్ ప్రజలు ఆధ్యాత్మికవాదులే కానీ మతతత్వవాదులు కాదు. రాజకీయాల్లో మతాన్ని ఆయుధంగా మేం ఎంతమాత్రం ఉపయోగించం. ఈ దేశంలో ప్రతి ఒక్కరు తమ తమ మతాన్ని విశ్వసించే పూర్తి స్వేచ్ఛ ఉంది. అది ఈ దేశం కల్పించిన హక్కు.” అని ఆమె తెలిపారు.  విజయ దినోత్సవం నాటి మతాతీత స్ఫూర్తిని మనమెంత మాత్రమూ వదులుకోకూడదని దేశ ప్రజలకు షేక్ హసీనా పిలుపిచ్చారు.

వాణిజ్యం, అనుసంధానం వంటి రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంచుకోవడానికి, చిలహతి-హల్దిబారి రైల్వే లింక్‌ను పునరుద్ధరించడానికి ఇరు పక్షాలు తొమ్మిది ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తున్నాయి. ఇదే విషయమై డిసెంబర్ 17 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వర్చువల్ శిఖరాగ్ర సమావేశానికి షేక్ హసీనా హాజరు కావాల్సి ఉంది. దీనికి ముందు ఆమె ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.