కొత్త చట్టాలతో రైతులను మోసం చేసిన కంపెనీకి షాక్ 

కొత్త సాగు చట్టాలపై కేంద్రం, రైతులకు మధ్య ఘర్షణ కొనసాగుతుండగానే మధ్యప్రదేశ్‌లో ఈ చట్టాల అమలు తాలుకు తొలి సానుకూల ఫలితం ఒకటి బయటపడింది. తాజాగా రైతులను మోసపుచ్చినందుకు ఓ ప్రైవేటు కంపెనీపై జిల్లా సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ భారీ జరిమానా విధించారు. 
 
జబల్‌పూర్‌లో పటాన్ తెహిసిల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో  మధ్యప్రదేశ్‌కు చెందిన శివశక్తి ట్రేడర్స్ కొంత మంది రైతులతో ధాన్యం కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది.  మొత్తం 3500 ధాన్యం బస్తాలకు రూ. 22.54 లక్షలు చెల్లించాలని ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. మండీకి ఆవలే ఇరు పార్టీలు కొత్త సాగు చట్టాల ప్రకారం ఈ  ఒప్పందం చేసుకున్నాయి.
అయితే సదరు కంపెనీ రైతులకు సమయానికి చెల్లింపులు చేయకపోడంతో వారు సంబంధింత అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్త క్షణం చెల్లింపులు చేపట్టాలంటూ సదరు కంపెనీకి ఆదేశాలు జారీ చేశారు.
ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్( ప్రొమోషన్ అండ్ ఫెసిలిటేషన్) యాక్ట్-2020 కింద ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కంపెనీ వేగంగా స్పందించి  రైతులకు అందాల్సిన మొత్తాన్ని చెల్లించింది. అయితే రైతులకు కష్టం కలిగించినందుకు సదరు కంపెనీపై మెజిస్ట్రేట్ రూ. 25 వేల జరిమానా కూడా విధించారు.
కొత్త సాగు చట్టాల ఆధారంగా ఓ ప్రైవేటు కంపెనీకి ఇంతటి జరిమానా విధించడం దేశంలోనే తొలిసారి అని తెలుస్తోంది. అంతుకుమునుపు మధ్యప్రదేశ్‌ అధికారులు ఈ చట్టాల ద్వారా రైతులకు ధాన్యంపై అత్యధిక ధర పొందేలా చేశారు. హొంషంగాబా‌ద్ రైతులకు ఓ ఢిల్లీ కంపెనీకి మధ్య కుదిరిన ఒప్పందానికి సదరు కంపెనీ కట్టుబడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మరో సందర్భంలో సమయానికి చెల్లింపులు చేయని ఓ వ్యాపారి ఆస్తులను కూడా అటాచ్ చేసినట్టు తెలిసింది.