అయోధ్య రాముడికి చలి నుండి వెచ్చదనం 

ఉత్తరప్రదేశ్‌లో చలితీవ్రత పెరిగిపోయింది. ప్రజలంతా గజగజ వణికిపోతున్నారు. హిందూ సంప్రదాయంలో దేవతా విగ్రహాలకు కూడా ప్రాణం ఉన్నట్లుగానే భావిస్తారు. అందుకే అయోధ్యలోని రామ్‌లల్లా, ఇతర దేవుండ్లకు చలిపెట్టకుండా కప్పేందుకు దుప్పట్లు అందజేయడంతోపాటు హీటర్‌ బ్లోవర్‌ ఏర్పాటు చేశారు. 

1992 లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఇది రెండోసారి. గతేడాది స్థానిక హిందూ మత పెద్దలు, కొంతమంది విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభ్యులతో కలిసి అయోధ్య కమిషనర్‌కు అభ్యర్థన చేసిన తర్వాత ఇలాంటి ఏర్పాట్లు చేశారు.

‘తాత్కాలిక ఆలయంలో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంది. దేవుళ్లు ఈ చలిలో బాధపడకుండా చూసుకునేందుకు బ్లోవర్ హీటర్‌ను ఏర్పాటు చేశాం. ఇది కాకుండా,  వెచ్చని దుప్పట్లు కప్పాం. ఆలయంలో ఫైర్‌ప్లేస్‌ను ఏర్పాటు చేయాలనుకున్నాం’ అని తెలిపారు. 

కానీ ఈ తాత్కాలిక ఆలయం చెక్క, గాజుతో తయారుచేయబడింది. సురక్షితంగా ఉండదని విరమించుకున్నాం.’అని అయోధ్యలోని తాత్కాలిక ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్‌ పేర్కొన్నారు. చలితగ్గేదాకా ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.

రాముడు చిన్నతనం నుంచి ఇక్కడ నివసిస్తున్నందున వాతావరణ మార్పుల నుంచి ఆయనను రక్షించుకునేందుకు ప్రత్యేక శ్రద్ధతీసుకుంటారని చెప్పారు. ఈ కాలంలో రాముడికి ఇట్ర్‌(సుగంధాలు‌)లో స్నానం చేయిస్తామని, వాతావరణానికి అనుగుణంగా అర్పణలు ఉంటాయని వివరించారు. 

వేసవిలోనూ దేవుండ్లను సౌకర్యవంతంగా ఉంచేందుకు ఆలయంలో ఇప్పటికే ఎయిర్‌ కండిషనర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు ఆలయ పూజారి వెల్లడించారు.