వ్యవసాయ చట్టాల రద్దుపై రాజ్యాంగ నిపుణుల హెచ్చరిక 

ఒక వంక ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు జరుపుతున్న చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడగా, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయవలసిందే అంటూ వారు పట్టుబడుతుండగా, ఆ విధంగా చేయడం ఒక చెడు సంప్రదాయం కాగలదని రాజ్యాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వతంత్ర భారత దేశంలో పార్లమెంట్ ఆమోదించిన కొద్దీ రోజులకే ఆయా చట్టాలను రద్దుచేసి వరవడి ఇప్పటి వరకు లేదని వారు గుర్తు చేస్తున్నారు.
“చట్టాలను రద్దు చేయడంతో పాటు సవరణలు తీసుకు రావాలని కోరడంకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది. పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన వెంటనే చట్టాలను రద్దు చేయడం అనూహ్యం, అసాధారణం” అని ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కాశ్యప్ పేర్కొన్నారు.
చాలా చట్టాలను రద్దు చేయడం జరిగినా వాటిని ఆమోదించిన వంద లేదా రెండు వందల ఏళ్లకు జరిగాయని ఆయన గుర్తు చేశారు.
“ఎన్నికైన ప్రజా ప్రతినిధులు చేసిన వాటిని కొన్ని గుంపులు కొట్టిపారవేయలేవు. ఇది ప్రజాస్వామ్యం, మూకుమ్మడివాదం కాదు. ఈ రోజు ఒక చట్టాన్ని చేసి, మరుసటి రోజు వత్తిడులపై రద్దుచేసుకోవడం ప్రభుత్వానికి తగదు. అలాగైతే పార్లమెంట్ కు బదులు గుంపులు చట్టాలు చేయవచ్చు” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మధ్యనే చేసిన చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ ను కేవలం వాటి వరకే పరిమితమై చూడరాదని లా కమీషన్ మాజీ సభ్యుడు ఎస్ శివశంకర్ హితవు చెప్పారు. విస్తృత పరిధిలో ఈ అంశాన్ని చూడాలని సూచించారు.  ఆ విధంగా చేస్తే అది చాలా చేదు సంప్రదాయాన్ని తీసుకు వస్తుందని అంటూ అదే మార్గంలో ఇతర చట్టాలను కూడా రద్దు చేయమని వత్తుడులు ఎదురవుతాయాని అంటూ ఆయన కాశ్యప్ అభిప్రాయాలను సమర్ధించారు.
కాగా, చట్టంలోని అంశాలు రాజ్యాంగ మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటె మాత్రమే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోగలదని ఆయన స్పష్టం చేశారు. “ఇప్పటి వలే పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు చట్టాల సవరణకు ఆర్డినెన్సు తీసుకు రావచ్చు. కానీ సాధారణంగా చట్టాల రద్దుకు ఆర్డినెన్సు లను తీసుకు రావు” అని ఆయన చెప్పారు.
కాగా, చట్టాలలో సవరణలకు సిద్ధంగా ఉన్నామని రైతులతో సంప్రదింపులు జరుపుతున్న కేంద్ర మంత్రులు ఇప్పటికే తెలిపారు. అదనంగా, సెప్టెంబర్ లో ఆమోదించిన ఈ మూడు చట్టాలకు నిబంధనలను ప్రకటించినప్పుడు ప్రభుత్వం మరిన్ని స్పష్టమైన వివరణలను అధికారికంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. 

ఇలా ఉండగా, నికార్సయిన, వాస్తవికమైన రైతు సంఘాలతో’ చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌ స్పష్టం చేశారు. రైతుల ముసుగులో కొన్ని జాతి వ్యతిరేక, వామపక్ష తీవ్రవాద శక్తులు ఆందోళనను హైజాక్‌ చేశాయని కేంద్రం ఆరోపించిన తరుణంలో తోమర్‌ భాషలో కూడా మార్పు కనబడటం గమనార్హం. 

మరోవంక,  మంగళవారం ఆయనను ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారతీయ కిసాన్‌ యూనియన్‌ (కిసాన్‌) అనే ఓ రైతు సంఘం కలిసి చట్టాలకు మద్దతు తెలియజేసింది. తమ ఆందోళననను విరమిస్తున్నట్లు కూడా ఆయనకు తెలిపింది. వారికి ధన్యవాదాలు చెప్పిన మంత్రి సాగు చట్టాలకు అనేక రాష్ట్రాల్లో మంచి మద్దతు లభించిందని చెప్పారు.

‘రైతుల నుంచి పంటను కొనుగోలు చేయడానికి పెట్టుకున్న కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అనేది పాలనా సంబంధమైన నిర్ణయం. అది యథాతథంగా కొనసాగుతుంది. అభ్యంతరాలపై అరమరికల్లేకుండా సిసలైన రైతు సంఘాలతో మాట్లాడడానికి మేం సిద్ధంగానే ఉన్నాం’ అని తోమర్‌ ఈ సందర్భంగా చెప్పారు.

అటు రైతు సంఘాలు తమ ఆందోళనను తీవ్రం చేయాలని భావిస్తున్నాయి.ఢిల్లీ-నొయిడాను కలిపే ప్రధాన రహదారుల్లో ఒకటైన చిలియా మార్గాన్ని బుధవారం దిగ్బంధించాలని తాజాగా నిర్ణయించాయి. సగటున రోజుకో రైతు చొప్పున మరణిస్తున్నాడనీ, ఈ 20 రోజుల్లో 20 మంది చనిపోయారని, వారికి ఈ నెల 20న శ్రద్ధాంజలి ఘటించనున్నామని రైతు నేత రిషపాల్‌ సింగ్‌ చెప్పారు.