చర్చ్, దర్గాలకు ప్రభుత్వ నిధులా జగన్!

రాష్ట్రంలో దర్గాలు, చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం ధనాన్ని ఏ విధంగా వినియోగిస్తారని ఏపీ ప్రభుత్వాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు.  సీఎం జగన్మోహన్ రెడ్డికి హిందూ సంప్రదాయలపై నమ్మకం, గౌరవం లేదని ధ్వజమెత్తుతూ దర్గాలకు ఐదు కొట్లు, చర్చిలకు రూ.24 కోట్లు కేటాయించారని విస్మయం వ్యక్తం చేశారు.
 
పుష్కరాల సమయంలో కూలగొట్టిన ఆలయాలను నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం బ్యారేజి సమీపంలో శనీశ్వర ఆలయం వద్ద బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సోమవీర్రాజు వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చిల‌ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు. 
 
చంద్రబాబు హయాంలో పుష్కరాల పేరు చెప్పి అనేక ఆలయాలు పడగొట్టారని.. ఆనాడు బీజేపీలో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ ఆలయాలు కట్టాలంటూ ఆందోళన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆయన దర్గాలను కడతామని ప్రకటిస్తారని విమర్శించారు. 
 
రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తీరు ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో అనేక ఆలయాలు జీర్ణావస్థలో ఉన్నాయని, వాటి పనులు చేపట్టి ఎందుకు అభివృద్ధి చేయడంలేదని నిలదీశారు. దేవాదాయ భూములను ఇళ్ల కోసం, నిధులను ఇతర కార్యక్రమం కోసం వాడతారా?  అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. 
 
ఆలయాలను పట్టించుకోకుండా దర్గాలను కట్టిస్తామని చెబుతారా? అని ప్రశ్నించారు. మంత్రి వెల్లంపల్లి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో క్రైస్తవ చర్చిలకు వేల కోట్ల ఆదాయాలు ఉన్నాయని, సీఎం జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే వాటి నుంచి డబ్బు తీసుకు‌ని ఖర్చు చేయాలని సవాల్ చేశారు. 
 
ముఖ్యమంత్రికి చర్చిలు, మసీదులే కావాలా ఆలయాల అభివృద్ధి అక్కర్లేదా? అని నిలదీశారు. గురువారం  అమరావతిలో జరిగే బహిరంగ సభకు మద్దతుగా బీజేపీ నుంచి ప్రతినిధులు పాల్గొంటారని సోమువీర్రాజు తెలిపారు.