ఒకేరకం విడాకుల నిబంధనలపై కేంద్రంకు సుప్రీం నోటీసు 

భార్యాభర్తలకు విడాకుల మంజూరుకు సంబంధించిన నిబంధనలు అందరికీ ఒకేవిధంగా ఉండాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన రెండు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.

దేశంలోని అన్ని మతాల మహిళలను సమానంగా చూడాలని పిటిషనర్ కోరారు. కొన్ని మతపరమైన ఆచారాలు మహిళలకు తమ ప్రాథమిక హక్కులను నిరాకరించినట్లయితే, అటువంటి ఆచారాలను కాపాడకూడదని కోరారు. 

దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘మేం జాగ్రత్తతో నోటీసు జారీ చేస్తున్నాం’’ అని పేర్కొంది. ‘‘వ్యక్తిగత చట్టాల్లోకి అక్రమంగా ప్రవేశించే, వ్యక్తిగత చట్టాలు సాధించాలనుకున్నదాన్ని ధ్వంసం చేసే  దిశలో మేం వెళ్ళేలా మీరు చేస్తున్నారు’’ అని పేర్కొంది. 

విడాకుల కోసం కారణాలు ఏకరీతిగా ఉండాలని కోరుతున్న పిటిషన్‌పై సీనియర్ అడ్వకేట్ పింకీ ఆనంద్ వాదనలు వినిపించారు. మనోవర్తి, పోషణ భత్యాలకు కారణాలు ఏకరీతిగా ఉండాలని కోరుతున్న పిటిషన్‌పై సీనియర్ అడ్వకేట్ మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. ఈ రెండు పిటిషన్లను అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేశారు. 

విడాకులకు కారణాలు తటస్థంగా లేవని ఓ పిటిషన్‌లో పేర్కొన్నారు. విడాకులు మంజూరు కావడానికి వ్యభిచారాన్ని కారణంగా చూపించే అవకాశం హిందూ, క్రైస్తవ, పారశీకులకు ఉందని, ముస్లింలకు ఇది కారణంగా నిలవదని తెలిపారు. 

నయంకానటువంటి కుష్ఠు వ్యాధిని కారణంగా చూపించేందుకు హిందువులు, క్రైస్తవులకు అవకాశం ఉందని, పారశీకులు, ముస్లింలు విడాకులు పొందేందుకు ఇది కారణంగా నిలవదని తెలిపారు. నపుంసకత్వం విడాకులు తీసుకోవడానికి ఓ కారణంగా హిందువులు, ముస్లింలకు వర్తిస్తుందని, ఇది క్రైస్తవులు, పారశీకులకు వర్తించదని పేర్కొన్నారు. 

వివాహ అర్హత వయసు కన్నా తక్కువ వయసులో పెళ్లవడం విడాకులు తీసుకోవడానికి కారణంగా హిందువులకు వర్తిస్తుందని, క్రైస్తవులు, ముస్లింలు, పారశీకులకు వర్తించదని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ‘‘వ్యక్తిగత చట్టాల్లోకి ప్రవేశించకుండా ఈ వివక్షాపూరిత కారణాలను తొలగించగలమా?’’ అని ప్రశ్నించింది.

పిటిషనర్ల తరపు న్యాయవాదులు స్పందిస్తూ, షాయరా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం చెప్పిందన్నారు. ఉమ్మడి పౌర స్మృతిని పరిశీలించాలని పార్లమెంటుకు సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ప్రస్తావించారు.