చైనా కట్టడికి దూకుడుగా క్షీపనులు ప్రయోగిస్తున్న భారత్ 

చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్‌ అమ్ములపొది శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే పలు రకాల మిస్సైల్స్‌ పరీక్షించిన డీఆర్‌డీఏ ఈ నెలలో మరో మూడు స్వదేశీ, జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్టుతో పాటు మరికొన్ని వ్యూవహాత్మక క్షిపణులను పరీక్షించేందుకు సిద్ధమైంది. 
 
వచ్చే వారంలో మూడు క్షిపణులను పరీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. సాయుధ దళాల స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ను బుధవారం ప్రయోగించనుండగా, సైన్యానికి చెందిన వ్యూహాత్మక బలగాల కమాండ్ డిసెంబర్ 18న లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-IVను ప్రయోగించనుంది. 
 
మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌ను వచ్చే వారం టెస్ట్‌ చేయనుంది. పృథ్వీ-2 ట్రయల్స్‌ను రాత్రి సమయంలో అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు లోబడి పరీక్ష నిర్వహించనున్నారు. బుధవారం వీలు కాకుండే గురువారం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 
 
అన్ని అనుకున్నట్లు జరిగితే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌ను డిసెంబర్‌ 22న టెస్ట్‌ చేయనున్నారు. పృథ్వీ-2, అగ్ని-4 క్షిపణులు రెండు ఇప్పటికే సత్తా చాటాయి. 
 
మరోవంక, ఐజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సహకారంతో  డీఆర్‌డీఏ   సంయుక్తంగా అభివృద్ధి చేసిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌  ప్రయోగంపై దృష్టి కేంద్రీకించింది. డీఆర్‌డీఏ ద్వారా అభివృద్ధి చేయబడ్డ డ్యూయల్ పల్స్ సాలిడ్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా శక్తివంతంగా తీర్చిదిద్దారు. 
 
శత్రు విమానాలు, మానవరహిత వైమానిక వాహనాలు, క్షిపణులు, రాకెట్లను ఛేదించడానికి ఎంఆర్‌ఎస్‌ఏఎంను రూపొందించారు. అత్యాధునిక రొటేటింగ్ ఫేజ్డ్ రాడార్‌తో పాటు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో లక్ష్యాన్ని గుర్తించి ధ్వంసం చేసేలా అత్యాధునిక యాక్టివ్‌ రాడార్‌ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌ను కలిగి ఉంటుంది. 
 
4.5 మీటర్ల పొడవున్న ఈ అణు సామర్థ్యం గల ఈ క్షిపణి బరువు 2.7 టన్నుల వరకు ఉంటుంది. 60 కిలోల బరువున్న పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. క్షిపణి ప్రయోగ వేదికలో క్షిపణిని గుర్తించడం, ట్రాక్ చేయడం, మార్గదర్శకత్వం కోసం మల్టీ-ఫంక్షనల్ సర్వైలెన్స్, థ్రెట్ అలర్ట్ రాడార్ ఉన్నాయి. 
 
ఇది 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను నాశనం చేయనుంది. దేశీయ భాగాలతో క్షిపణి పరిధిని 150 కిలోమీటర్ల వరకు విస్తరించాలని డీఆర్‌డీఓ యోచిస్తోంది. ఇప్పటి వరకు క్షిపణికి సంబంధించి మూడు ట్రయల్స్‌ నిర్వహించారు. ఈ క్షిపణ మాక్‌-2 గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. 
 
ఇజ్రాయిల్‌ నుంచి వచ్చిన రక్షణ శాస్త్రవేత్తల బృందం షెడ్యూల్‌ పరీక్ష ఫైరింగ్‌ కోసం భారత్‌ చేరుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది పృథ్వీ-2 మూడో టెస్ట్‌ ఫైరింగ్‌ జరుగుతుండగా  350 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్ కలిగిన ఈ క్షిపణిని ఇప్పటికే సాయుధ బలగాల్లో చేర్చారు. 
 
అలాగే, 4వేల కిలోమీటర్ల పరిధితో 20 మీటర్ల పొడవైన రెండు దశల అణు సామర్థ్యం కలిగిన అగ్ని-4 క్షిపణి సౌత్ ఈస్ట్ ఆసియాలో ఎక్కడైనా లక్ష్యాలను ఛేదించగలదు.