మరాఠా రిజర్వేషన్‌పై బీజేపీ  ఎమ్మెల్సీలు  వాకౌట్

మరాఠా రిజర్వేషన్‌పై మహారాష్ట్ర  ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ బీజేపీకి చెందిన ఎమ్మెల్సీలు మంగళవారం  శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత ప్రవీణ్ దారేకర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రశ్నల నుంచి తప్పించుకు తిరుగుతోందని ధ్వజమెత్తారు. 

“ఆజాద్ మైదానంలో విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మాకు కనీసం అవకాశం ఇవ్వడం లేదు. అందుకే మేము వాకౌట్ చేస్తున్నాం..’’ అని ప్రకటించారు. అంతకు ముందు మరాఠా రిజర్వేషన్‌, మహిళా భద్రత సహా పలు సమస్యలపై అసెంబ్లీ వెలుపల బీజేపీ ధర్నా చేపట్టింది. 

బలమైన ప్రతిపక్షాన్ని, చర్చను ఎదుర్కోలేకనే ప్రభుత్వం పారిపోతోందని మహారాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత ప్రవీణ్ దారేకర్ ఎద్దేవా చేశారు. మరాఠా రిజర్వేషన్ గురించి మహారాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

దీనికోసం ప్రభుత్వం సుప్రీంకోర్టులో శక్తిమేర ప్రయత్నించాలి. అదే సమయంలో ఓబీసీ రిజర్వేషన్లు కూడా చెక్కుచెదరకుండా, యధాతథంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందని ఆయన డిమాండ్ చేశారు.