కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రముఖ ఆలయం శబరిమల ఉన్న పండళం మున్సిపాలిటీలో బిజెపి విజయం సాధించింది. ఇక్కడ ఉన్న 33 వార్డుల్లో ఇప్పటికే 17 గెలిచి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఖాయం చేసుకోవడం విశేషం.
మరో ఆరు నెలల్లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ స్థానిక ఎన్నికలకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటి వరకూ కేరళలో పోటీ ప్రస్తుతం అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మధ్యే ఉండేది.
అయితే రాష్ట్రంలో క్రమంగా బలపడే దిశగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రయత్నిస్తోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకే మున్సిపాలిటీని గెలుచుకున్న బీజేపీ.. ఈసారి పండళంతోపాటు పాలక్కడ్‌లోనూ ఇప్పటికే విజయం సాధించడం విశేషం.
కొచ్చిన్ ఐలాండ్ నార్త్ డివిజన్ లో బిజెపి అభ్యర్థిని టి పద్మ మురళి సీనియర్ కాంగ్రెస్ నేత, మేయర్ అభ్యర్థి ఎన్ వేణుగోపాల్ ను ఒక ఓట్ తో ఓడించి సంచలన విజయం సాధించారు.
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతించడంతో ఈ గుడి వివాదానికి కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. దేశంలోనే ప్రముఖ ఆలయమైన శబరిమల ఉన్న పండళం మున్సిపాలిటీ విజయం కేరళ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాల ప్రకారం లెఫ్ట్ పార్టీల కూటమైన లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) ఎక్కువ స్థానాలు గెలుచుకోనున్నట్లు కనిపిస్తోంది. గ్రామ పంచాయతీ, పంచాయతీ బ్లాక్, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్)తో పోలిస్తే రెండింతల స్థానాలను ఎల్‌డీఎఫ్ గెలుచుకోనుంది.
ఇక మునిసిపాలిటీల్లో మాత్రం ఎల్‌డీఎఫ్ కంటే యూడీఎఫ్ మెరుగ్గా కనిపిస్తోంది. కార్పొరేషన్లలో ఇరు కూటములు చెరో సగం గెలుచుకోనున్నారు.
More Stories
కంగనా విచారణకు హాజరు కావాలని చండీగఢ్ కోర్టు నోటీసు
పదేళ్ల తర్వాత నేడే జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు
గణేష్ పూజను కూడా ఓర్వలేకపోతున్న కాంగ్రెస్