టిఎంసీ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరతారు 

టిఎంసీ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరతారు 
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు  దిలీప్ ఘోష్ జోస్యం చెప్పారు. టీఎంసీలో ప్రజాస్వామ్యం లేదని, నేతలకు గౌరవమర్యాదలు లేవని ఆయన ధ్వజమెత్తారు.
 
టీఎంసీలో ధిక్కార స్వరాన్ని బలంగా వినిపిస్తున్న, ఇటీవలనే మంత్రి పదవికి రాజీనామా చేసిన సీనియర్ నేత సువేందు అధికారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రోజుననే ఘోష్ ఈ ప్రకటన చేయడం. సువెందు బీజేపీలో చేరనున్నట్లు కధనాలు వ్యాపిస్తున్నాయి. 
టీఎంసీ పాలనలో బెంగాల్ రౌడీల రాజ్యంలా మారిందని, మార్పు కోరుకునే వారు ఆ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని దిలీప్ ఘోష్ తెలిపారు. ‘‘ బెంగాల్ మార్పు కోరుకునే వారు, అభివృద్ధికి కట్టుబడి ఉన్నవాళ్లు వెంటనే టీఎంసీని వదిలేసి బీజేపీలో చేరతారు’’ అని దిలీప్ ఘోష్ స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత రసవత్తరంగా వివాదస్పదంగా తయారువుతున్నాయి. బెంగాల్ కోటపై ఎలాగైనా కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి ప్రయత్నాలు చేస్తుంటే,  తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తోంది.
కాగా, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పేక మేడ‌లా కూలిపోతున్న‌ద‌ని బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షుడు, ప‌శ్చిమబెంగాల్ బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు ముకుల్ రాయ్ వ్యాఖ్యానించారు. ప్ర‌తిరోజూ ఎవ‌రో ఒక‌రు ఆ పార్టీ నుంచి బ‌య‌టికి వ‌చ్చి మా పార్టీలో చేరుతున్నార‌ని ముకుల్ రాయ్ చెప్పారు.
గ‌త నెల 27న సువెందు అధికారి త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశార‌న్న ముకుల్ రాయ్‌.. సువెందు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే సంతోషిస్తాన‌ని, ఆయ‌న‌ను తాము బీజేపీలోకి ఆహ్వానిస్తామ‌ని ఆనాడే చెప్పిట్లు గుర్తుచేశారు. ఈరోజు సువెందు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేశార‌ని, ఆయ‌న నిర్ణ‌యాన్ని తాను స్వాగ‌తిస్తున్నాన‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు.