కేంద్రంకు 17.6 శాతం తగ్గిన పన్నుల ఆదాయం 

కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో బాగా తగ్గింది. అడ్వాన్స్ ట్యాక్స్ సహా నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు 15 వరకు గతంతో పోల్చితే 17.6 శాతం తగ్గాయి.

గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు 15నాటికి ఈ పన్నుల వసూళ్ళు రూ.6.01 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది అదే సమయానికి రూ.4.95 లక్షల కోట్లు వసూలైనట్లు అంచనా. డిసెంబరు 15నాటికి అడ్వాన్స్ ట్యాక్స్ మూడో ఇన్‌స్టాల్‌మెంట్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు వస్తుంది. 

డిసెంబరు 15 వరకు వసూలైన కార్పొరేట్ ట్యాక్స్ రూ.2.26 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.2.57 లక్షల కోట్లు అని అంచనా. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుకు గడువు గత ఏడాది సెప్టెంబరు 15తో ముగిసిన తర్వాత కార్పొరేట్ ట్యాక్స్‌ రేటును ప్రభుత్వం గత ఏడాది తగ్గించింది. 

ప్రస్తుత కంపెనీలకు 25 శాతం, కొత్తగా ఇన్‌కార్పొరేట్ అయిన కంపెనీలకు 15 శాతం తగ్గించింది. ప్రభుత్వం అక్టోబరులో విడుదల చేసిన డేటా ప్రకారం, ఆర్థిక లోటు రూ.9.14 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లోనే ఆర్థిక లోటు వార్షిక బడ్జెట్ అంచనాల కన్నా 114.8 శాతం  పెరిగింది.  కోవిడ్-19 మహమ్మారి ప్రభావం ప్రభుత్వ ఆదాయంపై పడింది.